by Suryaa Desk | Tue, Nov 12, 2024, 07:25 PM
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో కలెక్టర్ సహా పలువురు అధికారులపై జరిగిన దాడి ఘటనను రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో పోలీసులు 55 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా.. దుద్యాల, కొడంగల్, బోంరాస్‌పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేశారు. అయితే.. అధికారులపై దాడి ప్రణాళిక ప్రకారమే జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు.. దీని వెనుక పలువురు నేతలు ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఒకరిద్దరు కీలక నేతలను కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. లగచర్లలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభిప్రాయసేకరణ కోసం నిర్వహించిన సభ రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై.. స్థానికులు కర్రలు, రాళ్లతో దాడులు చేయటం.. ఈ దాడుల్లో పలువురు అధికారులు గాయపడటం, కార్లు కూడా ధ్వసమవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
అయితే.. ఈ దాడిలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ ఎలాంటి గాయాలు కాకుండా త్రుటిలో తప్పించుకోగా.. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిపై వెంటాడి మరీ దాడి చేయటంతో.. తీవ్రంగా గాయపడ్డారు. వెంకట్ రెడ్డిని తప్పించేందుకు ప్రయత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మీద కూడా దాడి జరిగింది.
అయితే.. ఈ దాడి ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఫోలీసులు భావిస్తున్నారు. దీని వెనుక పలువురు నేతలు కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాడిలో ముఖ్య నిందితులుగా భావిస్తున్న వారి కాల్స్ లిస్ట్‌లో సంచలన విషయాలు బయటపడినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పర్యవేక్షిస్తున్నారు. కాగా.. ఈ ఘటనలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న బోగమోని సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. కాగా.. బోగమోని సురేష్ ఫోన్ నుంచి బీఆర్ఎస్ నేతకు సుమారు 42 సార్లు కాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ బీఆర్ఎస్ నేతను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.