by Suryaa Desk | Fri, Nov 15, 2024, 03:34 PM
మేం అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డిని ఏం చేయాలో తమకు తెలుసని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈరోజు కొడంగల్ తిరగబడ్డది... రేపు తెలంగాణ తిరగబడుతుందని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడవద్దని ధైర్యం చెప్పారు. లగచర్ల ఘటనలో అరెస్టై... సంగారెడ్డి జైల్లో ఉన్న వారితో ములాఖత్ అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తిరుపతిరెడ్డి ఫోన్‌లో ఆదేశాలిస్తుంటే... అధికారులు పాటిస్తున్నారన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబందులా మారారని మండిపడ్డారు. గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఫార్మా కంపెనీలు కావాలని చెప్పడమే కాకుండా వేలాది ఎకరాలు కావాలంటున్నాడని మండిపడ్డారు. లగచర్ల ఘటన సమయంలో ఓ వ్యక్తి కులగణనలో పాల్గొన్నారని, అతనిని కూడా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.ఓ ఐటీఐ విద్యార్థిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. కలెక్టర్ లగచర్లకు వచ్చినప్పుడు ఆందోళనలో పాల్గొన్నవారిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారని తెలిపారు. లగచర్ల ఘటనలో కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేశారన్నారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేశారని మండిపడ్డారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ ఘటనకు సీఎం కావాలనే రాజకీయ రంగు పులిమారన్నారు.తన పదవి ఐదేళ్లే ఉంటుందని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలని సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎకరం రూ.60 లక్షల భూమిని రూ.10 లక్షలకే లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పేదవాడి కన్నీళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందన్నారు. రేవంత్ రెడ్డికి చేతనైతే తమతో కొట్లాడాలి తప్ప అమాయకులతో కాదన్నారు.