by Suryaa Desk | Fri, Nov 15, 2024, 03:37 PM
గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు విమర్శించారు. ఈరోజు వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పుటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఇచ్చిన ప్రతి మాటనూ నెరవేరుస్తామన్నారు.సన్న ధాన్యంకు రూ.500 బోనస్ ఇస్తామని పునరుద్ఘాటించారు. రైతుల మీద బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ధాన్యం కేంద్రాల నుంచి సన్న ధాన్యం సేకరించిన వారం రోజుల్లో బోనస్ చెల్లిస్తామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. రైతులపై బీజేపీకి ప్రేమ ఉంటే తేమ శాతం నిబంధనలను మార్చాలని డిమాండ్ చేశారు.