by Suryaa Desk | Sat, Nov 16, 2024, 12:31 PM
శంషాబాద్ విమానాశ్రయంలో విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన విమానం గేటు వద్దకు రాగానే బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు అలజడి సృష్టించాడు.వెంటనే అప్రమత్తమైన సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో విమానంలో 136 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని ఐసోలేషన్ ప్రాంత్రానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబూ లేదని తేల్చారు.
గత కొన్నిరోజులుగా విమానాలకు నఖిలీ బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాగ్‌పూర్ విమానానికి కూడా బెదిరింపు వచ్చింది. అయితే అది ఉత్తదేనని నిర్ధారించారు. ఈ నెల 14న ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం అలజడి సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. ముంబై నుంచి అజర్‌బైజాన్‌కు వెళ్తున్న విమానంలో మహమ్మద్ అనే వ్యక్తి బాంబులను తీసుకెళ్తున్నాడని హెచ్చరించాడు. దీంతో సీఐఎస్‌ఎఫ్, స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈ నేపథ్యంలో బెదింపులకు పాల్పడే వ్యక్తులపై విమాన ప్రయాణ నిషేధం విధించాలని పౌర విమానయాన శాఖ ఆలోచిస్తున్నది.