by Suryaa Desk | Wed, Nov 13, 2024, 07:48 PM
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాల పరిరక్షణ కోసం 'హైడ్రా'ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగరంలోని చెరువుల ఎఫ్‌టీఎలు, బఫర్‌జోన్లు ఆక్రమించి నిర్మించిన వందలకొద్ది అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. మరికొందరు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశారు. ఇక హైడ్రా పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తున్నారు. తొలుత హైదరాబాద్ వరకే పరిమితం చేసిన సర్కార్.. ఆ తర్వాత ఔటర్ రింగు రోడ్డు పరిధి వరకు విస్తరించారు. నగరంలోని ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల కూల్చివేత బాధ్యతలను సైతం హైడ్రాకే కట్టబెట్టారు. తాజాగా.. సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చే జంట జలాశయాల పరిరక్షణ బాధ్యతలను కూడా హైడ్రాకే కట్టబెట్టారు. చారిత్రక ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతాలు, జలాశయాల పరిరక్షణ బాధ్యతను ఇక నుంచి హైడ్రానే చూసుకోనుంది. హైదరాబాద్ వాటర్ బోర్డు కేవలం నీటి సరఫరాకే పరిమితం కానుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఏర్పాటు తర్వాత ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను బోర్డు పరిధిలోకి తీసుకువచ్చారు. దీంతో వాటర్బోర్డు అధికారులు జంట నగరాలకు (హైదరాబాద్, సికింద్రాబాద్) తాగునీటిని సరఫరాపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కానీ జలాశయాల క్యాచ్మెంట్ ఏరియాలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఆక్రమణల గురించి వాటర్ బోర్డు అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో జలాశయాల పరిధిలో పెద్ద ఎత్తున కబ్జాలు జరిగాయి.
ఉస్మాన్ సాగర్కు 46 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా.. నీటి నిల్వ సామర్థ్యం 3.9 టీఎంసీలు. జలాశయం పరిధిలో మెుత్తం 84 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో కీలకమైన జన్వాడ, శంకర్పల్లి, కోకాపేట, నార్సింగి, ఖానాపూర్, మంచిరేవుల, బొంతక్పల్లి, చిన్న మంగళారం, చిల్కూరు, హిమాయత్నగర్, మొత్కుపల్లి, అప్పాజిగూడ, మేకన్గడ్డ వంటివి ఉన్నాయి. ఉస్మాన్సాగర్ సమీపంలోనే ఉన్న గచ్చిబౌలి, కొండాపూర్, నానక్రామ్గూడ, మాదాపూర్ ప్రాంతాలు ఐటీహబ్గా డెవలప్ అయ్యాయి.
హిమాయత్ సాగర్ 35 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉండగా.. నీటి నిల్వ సామర్థ్యం 2.9 టీఎంసీలు. శంషాబాద్, మొయినాబాద్, సుల్తాన్పల్లి, నర్కుడా, నాగిరెడ్డిగూడ, అజీజ్నగర్, కొత్వాల్గూడ, కవ్వగూడ తదితర ప్రాంతాలు ఈ జలాశయం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఆ వర్షపు నీరు నేరుగా హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్లకు చేరుకుంటాయి. ఈ రెండు జలాశయాల పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు 1995లో అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో 111 తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం జలాశయాలకు 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు, భారీ పరిశ్రమలు చేపట్టకూడదు.
అయినా వాటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. బోర్డుకు ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్ ఆక్రమణలను అడ్డుకోలేకపోయింది. దీంతో వారసత్వ కట్టడాలుగా ఈ రెండు జంట జలాశయాల పరిరక్షణ బాధ్యతలను సర్కార్ హైడ్రాకు అప్పగించింది. ఈ రెండు జలాశయాలకు సమీపంలో భారీగా నిర్మించిన ఫాంహౌస్లు, ఇతర చోట్ల నుంచి వచ్చి కలుస్తున్న మురుగును అడ్డుకోవటం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యతను హైడ్రాకు అప్పగించినట్లు తెలుస్తోంది.