by Suryaa Desk | Sat, Nov 16, 2024, 09:05 PM
తెలంగాణలో రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి సర్కార్.. రాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ చేపడుతోంది. ఇప్పటికే ఆయా మార్గాల్లో రహదారుల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు మరో మార్గంలోని రహదారి విస్తరణకు సిద్ధమైంది. రోడ్లు, రవాణా సౌకర్యం బాగుంటేనే.. ఆ ప్రాంతం అభివృద్ధి వేగంగా జరుగుతుందని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే.. గతంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే.. నారాయణపేట జిల్లా అభివృద్దిపై కూడా సర్కార్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే.. నారాయణపేట పట్టణాభివృద్ధిసంస్థ (నుడా)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పుడు నారాయణపేటకు 4 వరుసల రహదారిని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.
కోస్గి మండలం సర్జఖాన్‌పేట నుంచి నారాయణపేట మార్గాన్ని నాలుగు వరుసల రహదారిగా రూపొందించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటివరకు రెండు వరుసలు ఉన్న ఈ రోడ్డును రూ.230 కోట్లతో 56 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు విస్తరణ పూర్తయితే.. ఆ ప్రాంతంలో అభివృద్ధితో పాటు స్థానికులకు ప్రయోజను కూడా చేకూరనుంది. అంతేకాకుండా.. ముఖ్యంగా ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. కోస్గి, గుండుమల్, మద్దూరు మండలాల మీదుగా నారాయణపేటకు వెళ్లడంతో జిల్లాలో ఇదో ప్రధాన రహదారిగా రూపుదిద్దుకోనుంది.
ఈ రోడ్డు విస్తరణలో భాగంగా.. దోరేపల్లి, క్యాతన్‌పల్లి, బాపన్‌పల్లి గ్రామాల్లో రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఇరువైపులా డ్రైనేజీ కాలువలు కూడా నిర్మించనున్నారు. డివైజర్లలో అందమైన చెట్లు, విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసి రహదారిని అందంగా తీర్చిదిద్దేందుకు ప్రాణాళికలు సిద్ధంగా చేశారు. రోడ్డు మధ్య నుంచి 35 అడుగుల వెడల్పు పెరుగుతుంది. రెండు వైపులా 70 అడుగులు విస్తరించనుంది. కొన్ని చోట్ల విపరీతమైన మలుపులు ఉండగా.. వాటిని సరిచేస్తూ.. రోడ్డును విస్తరించనున్నారు.
అయితే.. అయ్యావారిపల్లి సేజ్టీ సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే.. ఈ రోడ్డు విస్తరణ జరిగితే.. ఈ ప్రమాదాలు తగ్గుతాయని స్థానికులు ఆంకాంక్షిస్తున్నారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కేంద్రానికి దీటుగా ఈ రహదారిని సుందరీకరిస్తూ విస్తరిస్తామని నారాయణపేట ఆర్‌అండ్‌బీ డీఈ రాములు తెలిపారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని.. ప్రభుత్వానికి పంపిస్తున్నామని చెప్పుకొచ్చారు.