by Suryaa Desk | Sat, Nov 16, 2024, 02:47 PM
అమృత్ పథకంలో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఇటీవల ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు తాను ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. అయితే, అందులో ఏమాత్రం నిజం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఓ చానల్‌తో మాట్లాడుతూ కేంద్రమంత్రి ఖట్టర్‌ను కేటీఆర్ కలవలేదని, ఒకవేళ కలిసి ఉంటే ఫొటోలు విడుదల చేసి ఉండేవారని పేర్కొన్నారు. కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకోవడం నిజమేనని, కానీ కేటీఆర్‌ను బయటి నుంచే పంపించివేశారని తెలిపారు.ఢిల్లీలో కేటీఆర్ ఒక్క బీజేపీ నాయకుడిని కూడా కలవలేదని కొండా పేర్కొన్నారు. ఎవరూ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. ఖట్టర్ ఆఫీస్ పీఏతో మాట్లాడిన తర్వాతే ఈ విషయాలు చెబుతున్నానని చెప్పారు. ఢిల్లీలో కేటీఆర్ కలిసింది కాంగ్రెస్ నాయకులనేనని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని ఉన్నప్పటికీ, కాంగ్రెస్ జాతీయ నాయకత్వం అడ్డుకుంటోందని విశ్వేశ్వర్‌రెడ్డి వివరించారు.