by Suryaa Desk | Sun, Nov 17, 2024, 11:36 AM
వరకట్న వేధింపుల హింసతో హత్యకు గురైన పోగుల (సంద) లత మృతి పట్ల సరైన విచారణ జరిగి చట్టపరంగా పూర్తి స్థాయి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని శనివారం రేచపల్లి లో జరిగిన పోగుల లత సంస్మరణ సభలో మహిళా సంఘాల, ప్రజా సంఘాల, హక్కుల సంఘాల ప్రతినిధులు ప్రతిన బూనారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి చెందిన పోగుల లత ఈనెల 8న నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేగోజి పేట లో వరకట్న హత్యకు గురైన సంగతి తెలిసిందే... ఆమె పెద్ద కర్మ కార్య క్రమాన్ని శనివారం రేచపల్లి గ్రామంలోని మృతురాలి తల్లిదండ్రులు పోగుల రాజేశం - మల్లేశ్వరి ల గృహంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన మహిళా సంఘాల, ప్రజా సంఘాల, హక్కుల సంఘాల ప్రతినిధులు పోగుల (సంద) లత చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. మౌనం పాటించి పోగుల (సంద) లత కి జోహార్లు అర్పించారు.
హత్య పట్ల పోలీసులు సరైన విచారణ జరిపి చట్టబద్ధంగా సరైన న్యాయం జరిగేంత వరకు కలిసి కట్టుగా అందరం కృషి చేద్దామని నిర్ణయించారు. ప్రత్యేక కమిటి ఏర్పాటు చేసుకొని ప్రాథమిక సమాచారంతో హత్య జరిగిన గ్రామం లో నిజ నిర్ధారణ జరిపి పోలీస్, ఇతర ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వాలకు నివేదిక అందజేయాలని నిర్ణయించారు. ఇక ముందు ఎక్కడ కూడా ఇలాంటి హత్యలు, వరకట్న వేధింపులు, గృహ హింసలు జరుగకుండా ఉండేందుకు హంతకులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులను, ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. లత హత్యను ఆత్మ హత్య గా చిత్రీకరించిన వారిని, హంతకులకు అండగా ఉన్న దళారీ మాఫియా ను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి,
చైతన్య మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్ శ్రీ దేవి వొటార్కర్, రాష్ట్ర నాయకురాలు కే.శ్రీదేవి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్గొండ పద్మ, పౌర హక్కుల సంఘం నేతలు పుల్ల సుచరిత, బొడ్డుపల్లి రవి, కడ రాజన్న, రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మునిమడుగుల మల్లన్న, దళిత లిబరేషన్ ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ రామిల్ల బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా కో కన్వీనర్ గాండ్ల మల్లేశం, నాయకులు గుమ్మడి కొమురయ్య, సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు పెండ్లి మల్లన్న, ఎరుకల రాజన్న, పొన్నం రాజ మల్లయ్య, బాలసాని రాజయ్య, వెల్గొండ లచ్చయ్య, దేవి సత్యం, సమ్ము రాజయ్య, జె.పోచం, బి.సత్యం, ఎ.సారయ్య, గంట సత్యం తదితరులు పాల్గొన్నారు.