by Suryaa Desk | Sun, Nov 17, 2024, 11:42 AM
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆధునిక సాంకేతిక అందిపుచ్చుకొని మార్కెట్ తో పోటీ పడాలని, మరింత వృద్ధిలోకి రావాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ స్థితిగతులపై కలెక్టరేట్ లో యజమానులు, ఆసాములతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, టెస్కో జీఎం అశోక్ రావు హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్వీఎం కు సంబంధించి 66 లక్షల మీటర్ల క్లాత్ ఆర్డర్ ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు కావాల్సిన క్లాత్ ఆర్డర్ ఇప్పించేందుకు కృషి చేస్తున్నానని వివరించారు. మహిళా సంఘాల బాద్యులకు ఏడాదికి రెండు చీరలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన డిజైన్లు పూర్తి అయ్యాయని, త్వరలో వాటికి అవసరమైన ఆర్డర్లు ఇస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి కోసం యార్న్ డిపో ఏర్పాటుకు రూ. 50 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. 80 శాతం క్రెడిట్ పై యార్న్ అందజేస్తామని, టెస్కో ఆద్వర్యంలో క్లాత్ సేకరిస్తామని తెలిపారు. కాటన్ వస్త్ర పరిశ్రమకు సహకారం అందిస్తామని, ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు. విద్యుత్ సబ్సిడీ అంశం కూడా డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి తో చర్చిస్తామని ప్రకటించారు. సిరిసిల్లలో నిలిచిపోయిన పద్మశాలి భవనం పూర్తి చేసే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. సిరిసిల్ల జిల్లా అభివృద్ది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. అన్ని పనులు ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.
మనోధైర్యంతో ముందుకుసాగాలి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు మనోధైర్యంతో ముందుకుసాగాలని విప్ పేర్కొన్నారు. పరిశ్రమను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వివరించారు.
ఈ నెల 20 వ తేదీన సీఎం రాక
ఈ నెల 20 వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పట్టణంలో సభ ఉంటుందని తెలిపారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, పలు పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.
ఆధునికత వైపు వెళ్లాలి
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ లో వస్తున్న ఆధునికత వైపు ముందుకు వెళ్లాలని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6 నెలల వరకు ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నదని తెలిపారు. మిగతా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్ లో ఉపాధి పొందేలా ఆలోచన చేయాలని కోరారు.
త్వరలో హోల్ సేల్ వ్యాపారులతో మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. వారికి అవసరమైన క్లాత్ విషయమై చర్చిస్తామని ప్రకటించారు. యార్న్ బ్యాంక్ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వస్త్ర పరిశ్రమకు చెందిన రూ. 150 నుంచి 200 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామని, యార్న్ సబ్సిడీ కూడా విడుదల చేస్తున్నామని వివరించారు. మిగితా అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, టెస్కో జీఎం అశోక్ రావు, హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సాగర్ పాల్గొన్నారు.