by Suryaa Desk | Sun, Nov 17, 2024, 06:32 PM
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. ఇప్పటికే మూసీ ప్రక్షాళన విషయంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతుండగా.. ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్లు చర్చకు తెరలేపాయి. అయితే.. మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన సవాలును స్వీకరిస్తూ.. బీజేపీ ఎంపీలు శనివారం (నవంబర్ 16న) రోజు రాత్రి మూసీ బస్తీల్లో నిద్ర చేశారు. ఈ మూసీ నిద్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు కె లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ తదితర నేతలు మూసీ పరివాహకంలోని మొత్తం 20 ప్రాంతాల్లో నిద్ర చేశారు. కాగా.. ఎల్బీనగర్‌లోని మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిద్రించారు.
అయితే.. బీజేపీ నేతలు చేసిన ఈ మూసీ నిద్రపై అధికార కాంగ్రెస్ నేతలు ఘాటు ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలవి అన్ని డ్రామాలే అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కామెంట్లు చేశారు. కాగా.. పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్లపై ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. బస్తీ నిద్ర అనతరం.. స్థానికులతో మాట్లాడిన ఈటల రాజేందర్.. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రాజెక్ట్ విషయంలో బీజేపీ పార్టీవి డ్రామాలే అయితే తాను రాజకీయాలు మానేస్తానని ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు.
బీజేపీవి డ్రామాలే అయితే మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇద్దరం కలిసి పర్యటిద్దామన్న ఈటల రాజేందర్.. అక్కడి ప్రజలు తమవి డ్రామలని అంటే రాజకీయాలు పూర్తిగా మానేస్తానంటూ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వానివే డ్రామాలని వాళ్లు చెబితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ పొన్నంతో పాటు ప్రభుత్వ పెద్దలకు ఈటల సవాల్ విసిరారు.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ధోరణి ఒక్కటేనని ఈటల రాజేందర్ ఆరోపించారు. కష్టపడి కూడబెట్టుకున్న డబ్బులు పెట్టి.. కట్టుకున్న నిరుపేదల ఇళ్లను కూలగొడతామంటే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని ప్రభుత్వాన్ని ఈటల రాజేంరర్ హెచ్చరించారు. కూల్చివేతలకు ఎన్ని బుల్డోజర్లు వచ్చినా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాత్రం తాము డ్రామాలు ఆడుతున్నామంటూ కామెంట్లు చేయటం సిగ్గుచేటని ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.