by Suryaa Desk | Sun, Nov 17, 2024, 06:29 PM
తెలంగాణలోని మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపికబురు వినిపించింది. రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమని పదే పదే చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు రకరకాల అవకాశాలను కల్పించటమే కాకుండా.. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో వారికే ప్రాధాన్యం కూడా ఇస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే.. స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు.. రాష్ట్రంలోని 22 జిల్లాలో ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించేందుకు గానూ.. సర్కార్ పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది.
ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్ల చొప్పున.. మొత్తం 22 భవనాలు నిర్మించేందుకు గానూ..110 కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భవనాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. ఆయా జిల్లాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ భవనాల నుంచే కార్యకలాపాలు సాగించనున్నాయి. అంతేకాకుండా.. ఇందిరా మహిళ శక్తి భవనాలలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్, కామన్ వర్క్‌షెడ్, ఉత్పత్తుల ప్రదర్శన మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ తదితర కార్యకలాపాలు ఈ ఇందిరా మహిళా శక్తి భవనాలలో నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా.. ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభలో ఈ ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. అయితే.. ఎక్కడెక్కడ ఈ భవనాలు నిర్మిస్తారన్నది మంత్రి సీతక్క తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా జాబితా విడుదల చేశారు.