by Suryaa Desk | Wed, Sep 25, 2024, 07:06 PM
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను వీలైనంత పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగ సమస్య తీవ్రతను గుర్తించి.. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. డిగ్రీలు, పీజీ పట్టాలతో కాలేజీ నుంచి బయటికి వచ్చిన యువతకు సరైన నైపుణ్యాలు ఉండటం లేదని.. ఇదే నిరుద్యోగ సమస్యకు ప్రధాన అంశమని పేర్కొన్నారు. అందుకే యువతకు కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలు నేర్పించి.. ఉద్యోగ కల్పన వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకపోతే చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓవైపు ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తూనే.. ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు పొందేలా యువతను తయారు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ ప్రోగ్రామ్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా కొత్త కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగా స్కిల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగ సమస్యను మాత్రం తరిమికొట్టలేమని సీఎం అన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రతను తమ ప్రభుత్వం గుర్తించిందని.. ఏటా 3 లక్షల మంది యువత పట్టాలు తీసుకుని బయటికి వస్తున్నట్లు తెలిపారు. కంపెనీలకు కావాల్సిన ఉపాధి అవకాశాలపై యాజమాన్యాలతో చర్చించామని.. ఎలాంటి కోర్సులు చేసిన వారు కావాలని వారిని అడుగుతున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో డిమాండ్-సప్లయ్ సూత్రాన్ని నిరుద్యోగ యువత గుర్తుంచుకోవాలని.. మార్కెట్‌లో అవసరం, డిమాండ్ ఉన్న కోర్సులను నేర్చుకోవడం వల్ల ఉద్యోగాలను సాధించవచ్చని వివరించారు. డిగ్రీ చదివే విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆలోచించి వాటికి సిద్ధం కావాలని సూచించారు.
కొందరు విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలకు ఎంపిక కాలేకపోతున్నారని తెలిపారు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయని.. అందులో రాణించాలంటే నైపుణ్యం ఉండాలని పేర్కొన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే యువత చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని.. బీటెక్ చదివిన విద్యార్థులు కూడా డ్రగ్స్ వలయంలో చిక్కుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ సమస్య నిర్మూలనకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని.. ప్రభుత్వం మాత్రమే ఈ సమస్యను పరిష్కరించలేదని.. అందరూ కలిసి కట్టుగా వస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమని గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత మారి.. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు కేవలం థియరీ మాత్రమే నేర్చుకుని జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదని.. కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులు ఉండటం లేదని పేర్కొన్నారు. కాలేజీల్లో సరైన సౌకర్యాలు, వసతులు లేకపోతే గుర్తింపును రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని చెప్పారు. త్వరలోనే యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు 30 లక్షల మంది నమోదు చేసుకున్నారని.. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత కూడా 60 లక్షల మంది నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని.. త్వరలోనే మరో 35 వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.