by Suryaa Desk | Wed, Sep 25, 2024, 07:08 PM
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చెరువులు, కుంటలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. బడాబాబులు, డబ్బున్నోళ్ల ఇండ్లను వదిలేసి మధ్యతరగతి, పేదల ఇండ్లను కూల్చిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పేదల నోట్లో మట్టి కొడుతున్నారని.. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
అమీన్‌పూర్ మున్సిపాలిటి పరిధిలోని పటేల్‌గూడలో ఆదివారం (సెప్టెంబర్ 22)న హైడ్రా పలు విల్లాలు, ఇండ్లు కూల్చేసింది. ఈ కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోయిన ఓ వ్యక్తి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను సీఎం రేవంత్ రెడ్డి డైహార్ట్ ఫ్యాన్ అని.. అయినా ఈ కూల్చివేతలు చూస్తేంటే కన్నీళ్లు ఆగటం లేదన్నారు. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చానని చెబుతున్న రేవంత్.. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయే స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. రేవంతన్న మధ్యతరగతి వారి ఇండ్లు కూల్చేస్తున్నాడని తమ్ముడిగా తనను ప్రశ్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
రేవంతన్నా ఇది న్యాయమా..? నేను తప్పుగా మాట్లాడితే రాళ్లతో కొట్టి చంపండి. నువ్వు 5 రోజుల ముందు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశావ్. రూ.4 లక్షల చలాన్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసిన్రు. ఆ డబ్బులు ఎవడికి పోయినట్లు..? రిజిస్ట్రేషన్ల పేరుతో వచ్చే డబ్బు మెుత్తం తినేస్తున్నరు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు కూడా ఉండట్లేదు. దమ్ముంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు డెవలప్ చేయండి. రోడ్లు వేయండి. నీళ్లు ఇవ్వండి. ఉన్నవన్నీ ఇష్టం వచ్చినట్లు కూలిస్తే నువ్వేం సీఎంవయ్యా? ప్రభుత్వాన్ని నువ్వు నిలబెట్టట్లేదు. నువ్వు కూల్చేస్తున్నవ్. మిడిల్ క్లాస్ పర్సన్ హైదరాబాద్ వచ్చి ఇల్లు కట్టుకోవాలంటే భయపడే స్థితికి తీసుకొచ్చారు.
నువ్వు రియల్ ఎస్టేట్ నుంచి వచ్చానని చెబుతున్నావ్.. కానీ మెుత్తం రియల్ ఎస్టేట్‌ను కూల్చేస్తున్నావ్. ఈ కూల్చివేతలు చూస్తుంటే ఏడుపొస్తుంది. రేవంత్ రెడ్డికి నేను డైహార్ట్ ఫ్యాన్‌ను.. అలాంటిది నేను ఎదురుతిరిగి అడుగుతున్నా. ఒరేయ్ మీ అన్న ఇట్ల కూల్చేస్తున్నడు.. తమ్ముడివి నీకు సిగ్గులేదా అని అడుగుతున్నరు. మీ రేవంత్ అన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న మధ్యతరగతి ఇండ్లు కూల్చేస్తున్నరు అని నిలదీస్తున్నారు. నేను ఎవరికి ఏం చెప్పుకోవాలి. ఇండ్లు కొన్నవాళ్లు గుండెలు బాదుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. వారి ఆర్తనాదాలు వినండి. గవర్నమెంట్ హైడ్రా పేరుతో ఇన్ని కూల్చివేతలు చేపట్టడం దారుణం. హైడ్రా నిజమైతే ముందుగానే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నోటీసులు పెట్టండి.' అని రేవంత్ వీరాభిమాని అని చెప్పుకునే సదరు వ్యక్తి తన ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.