by Suryaa Desk | Wed, Sep 25, 2024, 07:32 PM
హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. దీంతో నగర అభివృద్ధిపై రేవంత్ ప్రభుత్వ దృష్టి సారించింది. ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళనపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. లండన్ థేమ్స్ నది మాదిరిగా మూసీని అభివృద్ధి చేస్తామని రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాలని డిసైడ్ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారికి బాధితులకు ఇండ్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు ఈ ఇండ్లను ఉపయోగిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మూడు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఇంటింటికి వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించారో తెలియజేయనున్నారు. ముందుగా రివర్ బెడ్‌లో ఆక్రమణలో ఉన్న 1600 ఇళ్లను తొలగించి అక్కడ ఉన్న వారిని తరలిస్తారు.
మూసీ బఫర్ జోన్‌లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు RFCTLARR చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చుతో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లిస్తారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా కేటాయిస్తారు. మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించారు. నిర్వాసితులను సంప్రదించి పునరావాసం కల్పించే ప్రక్రియను కలెక్టర్లు ప్రారంభించనున్నారు.
హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని బుధవారం సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని.. అలాంటి వారికి డబుల్ బెడ్‌రూం లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలన్నారు. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని సూచించారు. చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలన్నారు.