by Suryaa Desk | Thu, Sep 26, 2024, 07:35 PM
హైడ్రా వంటి వ్యవస్థ కావాలని మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం సహా పలు ప్రాంతాల నుంచి డిమాండ్ వస్తోందని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రాకు స్వయంప్రతిపత్తి ఇచ్చినట్లు చెప్పారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి వ్యవస్థ కావాలని అడుగుతున్నారని తెలిపారు. కబ్జాదారులు పేదలను ముందు పెట్టి ఆక్రమణలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగానే పేదలు ఉంటే వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు.సీతక్క ఢిల్లీలో పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలోని సమస్యలను ఈ సమావేశం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. గ్రామ సభల తీర్మానమే ఉన్నతమైనదని పెసా యాక్ట్ చెబుతోందన్నారు. పెసా యాక్ట్ ఉన్న గ్రామాల్లో అక్కడి పెద్దల తీర్మానాలతో వివిధ అనుమతులు తీసుకోవచ్చునని చెప్పారు. మౌలిక సౌకర్యాల నిర్మాణాలకు అటవీ చట్టాలతో ఆటంకం ఏర్పడుతోందన్నారు.కేంద్రం మంజూరు చేసిన అటవీ ప్రాంతానికి సంబంధించి నిధులు ఏళ్లుగా మురిగిపోతున్నాయని సీతక్క అన్నారు. అటవీ చట్టాలతో మౌలిక సౌకర్యాల నిర్మాణాలకు ఆటంకం కలుగుతోందన్నారు. దీంతో నిధులు ఖర్చు చేయని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. కేంద్రం నిధుల వినియోగానికి అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. అనుమతులు లభించేలా అటవీ అధికారులకు సూచనలు చేయాలని ఈ సమావేశంలో కోరినట్లు తెలిపారు. గ్రామాల అవసరాలకు అవసరమైన అనుమతులు వచ్చేలా చూడాలని కోరామన్నారు. అటవీ గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలకు అధికారం ఇవ్వాలన్నారు.