by Suryaa Desk | Thu, Sep 26, 2024, 08:37 PM
హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... ఫార్మా సిటీని రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు వివిధ వేదికలపై రద్దు గురించి చెప్పారన్నారు.ఫార్మా సిటీ విషయంలో తాము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా అప్పుడు ఆరోపణలు గుప్పించారని, ఫార్మా సిటీని రద్దు చేసి రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తామని కూడా వారు చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫార్మా సిటీ గురించి రైతులు హైకోర్టును ఆశ్రయించగా... ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు కాలేదని కోర్టుకు చెప్పిందని తెలిపారు.ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, ఫోర్త్ సిటీ అని సీఎం మాట్లాడుతున్నారని, కానీ వీటి కోసం ఎక్క ఎకరమైనా భూసేకరణ చట్టం కింద సేకరించావా? అని ప్రశ్నించారు. వీటి కోసం భూమిని సేకరించకపోతే... తాము గతంలో ప్రతిపాదించిన ఫార్మా సిటీ భూమే అయితే దానిని ఇతర అవసరాలకు ఎలా మళ్లిస్తావని నిలదీశారు. ఫార్మా సిటీ రద్దు కాలేదని చెప్పి, న్యాయమూర్తులను కూడా తప్పుదోవ పట్టించారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి ఆయన సోదరులకు వేల కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే కుట్ర జరుగుతోందన్నారు. ఆ కుట్రలో భాగంగానే ఫార్మా సిటీ కొనసాగుతోందని హైకోర్టుకు నివేదిక ఇచ్చి, రద్దు చేస్తున్నట్లు వివిధ సందర్భాల్లో ప్రకటించారని ఆరోపించారు. ఫార్మా సిటీ వెనుక జరిగిన వేల కోట్ల రూపాయల కుంభకోణాన్ని త్వరలో బయటపెడతామని కేటీఆర్ అన్నారు.బీఆర్ఎస్ హయాంలో 14 వేల ఎకరాల్లో రూ.64 వేల కోట్ల పెట్టుబడులతో ఫార్మా సిటీని ప్రతిపాదించామన్నారు. నిబంధనల ప్రకారమే తాము భూసేకరణ చేపట్టామన్నారు. ఆ భూములను ఇతర అవసరాలకు మళ్లించవద్దన్నారు. ఈ 14 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేయకుంటే రైతులకు తిరిగి ఇచ్చేయవలసి ఉంటుందన్నారు.