by Suryaa Desk | Sun, Nov 17, 2024, 09:15 PM
తెలంగాణలో ఈ ఏడాది సమృద్ధిగానే వర్షాలు కురిశాయి. ఒక్క ఆగస్టు నెల మినహాయిస్తే.. మిగిలిన మాసాల్లో జోరుగా వర్షాలు పడ్డాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా వర్షాలు కురవటంతో అధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక బంగాళాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో శీతాకాలం ప్రారంభమైన వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేడు వర్షాలు, వాతావరణపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.
నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. తెలంగాణలో మాత్రం నేడు పొడి వాతావరణమే ఉంటుందని చెప్పారు. పలు ప్రాంతాల్లో చిరు జలల్లు తప్ప పెద్దగా.. ఎటువంటి వర్ష సూచన లేదని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నవంబర్ 22వ వరకు ఇటువంటి పొడి వాతావరణమే రాష్ట్రంలో ఉంటుందన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి వర్షం హెచ్చరికలు లేవని స్పష్టం చేశారు.
అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో 18 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఉదయం సమయంలో పొగ మంచు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలని నిపుణలు సూచిస్తున్నారు. వాహనదారులు సైతం ఉదయం వేళల్లో ప్రయాణాలు పెట్టుకోకపోవటమే ఉత్తమమని అంటున్నారు.
ఇక ద్రోణి ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రేపు కూడా వర్షాలకు అవకాశం ఉందన్నారు. నేడు వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.