by Suryaa Desk | Sun, Nov 17, 2024, 09:14 PM
తెలంగాణలో సచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం వారు విచారణ ఎదుర్కొంటుండగా..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉన్న పలువురికి తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారించారు. తాజాగా.. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను సైతం పోలీసులు విచారించారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారణాధికారి వెంకటగిరి దాదాపు గంటన్నరపాటు జైపాల్ యాదవ్‌ను విచారించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన ప్రస్తుత ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోదరుడి కుమారుడు రాజిరెడ్డి, గుండూరు ప్రాంతానికి చెందిన ఎస్.వెంకటేశ్వర్‌రావు నెంబర్లను అప్పటి అదనపు ఎస్పీ, ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నకు తాను పంపినట్లు జైపాల్ యాదవ్ ఒప్పుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ నెంబర్లు తిరుపతన్నకు ఎందుకు పంపారని.. పోలీసులు ప్రశ్నించగా.. తనకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుందని తెలియదని జైపాల్ యాదవ్ బదులిచ్చినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉపయోగించిన సెల్‌ఫోన్ ఇవ్వాలని జైపాల్ యాదవ్‌ను పోలీసులు కోరగా.. రెండు రోజుల్లో తీసుకొచ్చి అప్పగిస్తానని చెప్పినట్లు తెలిసింది.
పోలీసుల విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఒక కుటుంబ సమస్య పరిష్కారానికి సంబంధించి తాను రెండు ఫోన్ నంబర్లను తమ సామాజికవర్గం కావడంతో అప్పటి అదనపు ఎస్పీ తిరుపతన్నకు పంపినట్లు జైపాల్ యాదవ్ తెలిపారు. ఆయా నంబర్లను, తేదీలను చూపి పోలీసులు తనను ప్రశ్నలు అడిగారని.. వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్నారు. పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా తాను ఇచ్చిన నంబర్లు పొలిటికల్ లీడర్లవి కావని అన్నారు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్‌గా చేసుకుని ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా ఉన్నామని చెప్పారు. ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని అన్నారు. తనను పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని జైపాల్ యాదవ్ స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యవహారంలో మరో ముగ్గురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. త్వరలోనే వారిని కూడా విచారించనున్నట్లు సమాచారం.