![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 06:12 PM
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయాల్లోనే కాదు, కరాటేలోనూ తన సత్తా చాటారు. 59 ఏళ్ల వయసులో తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. బెల్ట్ టెస్టులో పాల్గొన్న ఆయన జడ్జిలను మెప్పించి సెవెన్త్ డాన్ బ్లాక్ బెల్ట్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన శక్తిమంతమైన ఫ్రంట్ కిక్స్, సైడ్ కిక్స్‌తో వావ్ అనిపించారు. వయసుతో నిమిత్తం లేకుండా ఆయన చూపిన చురుకుదనం అందరినీ ఆశ్చర్యపరిచింది.మారేడుపల్లిలోని వైడబ్ల్యూసీఏలో జరిగిన టెస్టులో మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలో ఆయన తన నైపుణ్యాలను ప్రదర్శించారు. మూడు గంటల పాటు సాగిన ఈ పరీక్షలో ఆయన పట్టుదల, అంకితభావం కనబరిచారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని సూచించారు. నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండవచ్చని ఆయన అన్నారు. కరాటే బ్లాక్ బెల్ట్ సాధించడం పట్ల ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.