![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 01:11 PM
నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేటలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొక్కులు తీర్చుకునేందుకు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన వారు భార్యాభర్తలు కాదన్న విషయం తెలుసుకున్న దుండగులు యువతిని బెదిరించి లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. అఘాయిత్యానికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతంలో ప్రేమికులను, మైనర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసిన విషయం కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది.మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ కథనం ప్రకారం.. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో బైక్‌పై ఓ జంట ఆలయానికి రావడాన్ని నిందితుల్లో నలుగురు గమనించారు. వారు అనుమానాస్పదంగా కనిపించడంతో నిందితులు నలుగురు మరో ముగ్గురికి ఫోన్ చేసి పిలిపించారు. బైక్‌పై ఆలయానికి వచ్చినవారు భార్యాభర్తలు కాదన్న విషయం తెలుసుకొని యువతితోపాటు వచ్చిన వ్యక్తిని కట్టేసి ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడి పరారయ్యారు. అనంతరం ఆమె తనతోపాటు వచ్చిన వ్యక్తి కట్లు విప్పింది.ఆదివారం ఉదయం ఇద్దరూ కలిసి భూత్పూరు మండలంలోని తమ స్వగ్రామానికి వెళ్తుండగా నిందితుల్లో ఒకడైన మహేశ్‌గౌడ్ గమనించాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే మీ వ్యవహారం బయటపెడతానని బెదిరించాడు. దీంతో భయపడిన ఆమె అసలు విషయాన్ని దాచిపెట్టి గుర్తు తెలియని వ్యక్తులు తమను బెదిరించి బంగారు ఆభరణాలు, డబ్బు చోరీ చేసినట్టు ఊర్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఆలయానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగి మహేశ్‌గౌడ్ బాధితురాలిని బెదిరించడాన్ని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఊర్కొండపేటకు చెందిన సాధిక్‌బాబా, హరీశ్‌గౌడ్, మణికంఠగౌడ్, మారుపాకుల ఆంజనేయులు గౌడ్, మట్ట ఆంజనేయులు గౌడ్, కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కార్తీక్ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. నిందితులకు వీలైనంత త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఐజీ తెలిపారు.