![]() |
![]() |
by Suryaa Desk | Fri, Apr 04, 2025, 11:31 AM
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ జంట తన 25వ వివాహ వేడుకను ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరూ స్టేజిపై డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో భర్త డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి అతిథులు సహా అందరూ నిశ్చేష్టులయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాధితుడు 50 ఏళ్ల షూ వ్యాపారి వాసిమ్ సర్వాత్. భార్య ఫరాతో కలిసి సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వాసిమ్ ఆ తర్వాత ఉన్నట్టుండి స్టేజిపై కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వాసిమ్ భార్య ఫరా స్కూల్ టీచర్ కాగా, వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇది గుర్తించలేని హార్ట్ ఎటాక్ అని సీనియర్ కార్డియాలజిస్ట్ ఒకరు తెలిపారు. రక్త ప్రసరణలో సమస్యలు కానీ, గుండెలయలో సమస్యలు కానీ అంతర్లీనంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయని తెలిపారు. కాబట్టి ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కానీ, గుండె లయ అసంబద్ధంగా ఉన్నప్పుడు కానీ వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.