|
|
by Suryaa Desk | Wed, May 07, 2025, 06:16 AM
హైదరాబాద్ నగరం ప్రతిష్ఠాత్మక ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ అంతర్జాతీయ వేడుక కోసం వందకు పైగా దేశాల నుంచి అందాల భామలు భాగ్యనగరానికి తరలివస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలికేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో, పోటీల నిర్వహణపై హైటెక్ సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.మిస్ ఇండియా నందిని గుప్తా మాట్లాడుతూ, తెలంగాణ గురించి ప్రస్తావించిన ప్రతిసారీ తనకు గొప్ప అనుభూతి కలుగుతుందని అన్నారు. ఈ ప్రాంత సంస్కృతి, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడి ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచుతారని తెలిపారు. హైదరాబాదీ బిర్యానీ నుంచి ఇరానీ చాయ్ వరకు స్థానిక వంటకాలు అమోఘంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే ప్రతి యువతి ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని నందిని గుప్తా అభిప్రాయపడ్డారు.