|
|
by Suryaa Desk | Thu, May 29, 2025, 08:34 PM
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఈరోజు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం, ఆయనకు తాత్కాలికంగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల్లోగా ప్రభాకర్ రావు భారతదేశానికి తిరిగి రావాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, ప్రభాకర్ రావు భారత్ తిరిగి వచ్చేందుకు వీలుగా ఆయన పాస్‌పోర్ట్‌ను కూడా మంజూరు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయనపై ఎలాంటి కఠినమైన చర్యలు చేపట్టవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లో ఇండియాకు రావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది.