|
|
by Suryaa Desk | Fri, Nov 14, 2025, 07:21 PM
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలోని కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కేటీఆర్‌కు అహంకారం, హరీశ్ రావుకు అసూయ ఎక్కువగా ఉన్నాయని.. వాటిని తగ్గించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. అయినా బుద్ధి రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. అప్పటికీ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మళ్లీ బుద్ధి చెప్పారు’ అంటూ కేటీఆర్ , హరీష్ రావుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వరుస ఓటముల తర్వాత కూడా వారి వైఖరి మారకపోతే.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కనిపించకుండా పోవడం ఖాయం అని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని.. ప్రభుత్వానికి సహకరించాలని ఆయన ప్రతిపక్ష నేతలకు సూచించారు.
జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ.. నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదని గుర్తుచేస్తూ.. ఆ ఫలితాల తర్వాత హైదరాబాద్ ప్రజలకు కాంగ్రెస్‌పై క్రమంగా నమ్మకం పెరుగుతోందని అన్నారు.
‘గెలుపోటములకు కాంగ్రెస్ ఎప్పుడూ కుంగిపోదు, పొంగిపోదు. ప్రజల తరపున నిలబడటం, పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా పరిశీలించి, జూబ్లీహిల్స్‌లో ఈ తీర్పు ఇచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో బీఆర్‌ఎస్ వైఖరిని తప్పుబట్టారు.
రాష్ట్ర ఆదాయంలో 65 శాతం వరకు హైదరాబాద్ నుంచే వస్తోందని, హైదరాబాద్ అభివృద్ధి కోసం ఎవరి పాత్ర వాళ్లం పోషిద్దామని పిలుపునిచ్చారు. హైడ్రా, ఈగల్ వంటి సంస్థలను హైదరాబాద్ అభివృద్ధి కోసమే ప్రభుత్వం తీసుకొచ్చిందని.. కానీ వాటిపైనే బీఆర్‌ఎస్ దృష్టి పెట్టి తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. ప్రజలు వాస్తవాన్ని గుర్తించి ఓటు వేశారని అన్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేయడం ఇకనైనా బీఆర్‌ఎస్ నేతలు ఆపాలని హితవు పలికారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘కిషన్ రెడ్డి ఇప్పుడైనా మేల్కొని సచివాలయానికి రావాలి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించి.. కలిసి సాధించుకొద్దాం’ అని ఆయన ఆహ్వానించారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
కిషన్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మారి ప్రచారం చేశారని సీఎం ఎద్దేవా చేశారు. ‘పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క జూబ్లీహిల్స్‌లోనే కిషన్ రెడ్డికి 60 వేల ఓట్లు వచ్చాయి. ఆయన అభ్యర్థిగా మారి ఇన్ని రోజులు ప్రచారం చేస్తే 17 వేల ఓట్లే వచ్చాయి. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోవాలి’ అని సీఎం హితవు పలికారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయంలో రాష్ట్ర అభివృద్ధే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.