|
|
by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:12 PM
సింగరేణి సంస్థ పరువును బజారుకీడ్చేలా జరుగుతున్న దుష్ప్రచారాలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం సంస్థపై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వాస్తవాలను వెల్లడించారు.
సింగరేణి టెండర్లలో ‘సైట్ విజిట్’ అనే నిబంధనను ఏదో కొత్తగా చేర్చినట్లు కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో కథనాలు రావడంపై భట్టి స్పష్టత ఇచ్చారు. ఈ నిబంధన వెనుక ఉన్న నిజాలను తెలిపారు. సైట్ విజిట్ నిబంధనను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియా 2018లోనే తన టెండర్ పత్రాలలో పొందుపరిచింది. 2021లో సెంట్రల్ మైనింగ్ (CMPDI) కూడా సైట్ విజిట్ తప్పనిసరి అని పేర్కొంది. ఆ సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేదు. కేవలం సింగరేణిలోనే కాదు.. గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, రైల్వేస్‌కు చెందిన 'రైట్స్', హిందుస్థాన్ కాపర్స్ వంటి కేంద్ర సంస్థల టెండర్లలోనూ ఈ నిబంధన అమల్లో ఉంది.
సింగరేణి అనేది తెలంగాణకు గుండెకాయ వంటిదని.. సుమారు 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది జీవనోపాధి దీనిపై ఆధారపడి ఉందని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. అక్రమ రాతల వల్ల కార్మికుల మనోస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఒక స్వయంప్రతిపత్తి (Autonomous) సంస్థ అని.. ఇక్కడ జరిగే ప్రతి నిర్ణయం మంత్రిమండలి వద్దకు రాదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ప్రజల్లో అపోహలు కలగకూడదనే ఉద్దేశంతో నైనీ కోల్ బ్లాక్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
విచారణను స్వాగతిస్తున్నాం..
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు లేఖ రాయడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారణకు ఆదేశించడాన్ని తాము స్వాగతిస్తున్నామని భట్టి పేర్కొన్నారు. విచారణ జరిగితేనే అసలు నిజాలు బయటకు వస్తాయని.. ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం ఇలాంటి కథనాలు వండివారుస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. సింగరేణి ఆస్తులను రాబందుల నుండి కాపాడే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి, రాష్ట్రానికి నష్టం చేసేలా ప్రవర్తించడం సరికాదని విపక్షాలకు హితవు పలికారు.