|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:22 PM
సినీనటి, ఏపీ బీజేపీ నేత మాధవిలతపై షిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు ఐక్య వేదిక ఫిర్యాదు చేసింది. సాయి బాబాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఐక్య వేదిక డిమాండ్ చేసింది.ఈ అంశంపై రామచందర్ రావు స్పందిస్తూ.. షిరిడి సాయి బాబాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం తగదని అన్నారు. ఆమె సాయి బాబాపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మాధవిలత తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సూచించారు. ఎవరైనా సరే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని, ఇలాంటి వ్యాఖ్యలకు బీజేపీ మద్దతు ఉండదని, పార్టీ ఏకీభవించదని స్పష్టంగా తెలిపారు.ఇదే సందర్భంగా షిరిడి సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఐక్య వేదిక హెచ్చరికలు జారీ చేసింది. వేదిక అధ్యక్షుడు మంచికంటి ధనుంజయ మాట్లాడుతూ.. సాయి బాబాపై లేనిపోని మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. సాయి బాబాపై జరుగుతున్న దుష్ప్రచారం సరైంది కాదని, సాయి బాబా ఆలయంలో జరిగేవన్నీ హిందూ సంప్రదాయ పూజలేనని, ఇతర పూజలు కాదని స్పష్టం చేశారు.