|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 08:06 PM
బోరబండ, రహ్మత్ నగర్ లోని పలు కాలనీల్లో రాత్రి సమయంలో నీటి సరఫరా వల్ల ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి రెండున్నర కోట్లతో ఫీడర్ మెయిన్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో మంగళవారం ఎస్పీఆర్ హిల్స్ లో నిర్మిస్తున్న పైపులైను నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఏండీ.. పైప్ లైన్ నిర్మాణ పనులలో వేగం పెంచి ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అవసరం అయితే కార్మికుల సంఖ్య పెంచి, మరిన్ని గ్యాంగులను సమకూర్చుకోవాలని సూచించారు.ఈ సందర్బంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్పిఆర్ హిల్స్ ప్రాంతంలో నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి నీటి సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బంది పడేవారని అన్నారు. దీంతోపాటు మరికొన్ని బస్తీల్లో రాత్రి సమయంలోనూ మంచినీటి సరఫరా చేయడం.. లో ప్రెషర్ లాంటి సమస్యలు ఉండేవని చెప్పారు. గత సవంత్సరంలో బోరబండ, రహమత్ నగర్ డివిజన్ లలోని 52 బస్తీల్లోని, పలు కాలనీల నీటి సమస్యను తీర్చడానికి ప్రభుత్వం దాదాపు రూ. 5.7 కోట్ల వ్యయంతో 3 మిలియన్ లీటర్ల రిజర్వాయర్ ను నిర్మాణం చేపట్టి పూర్తి చేసిందని చెప్పారు. రికార్డ్ స్థాయిలో ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రిజర్వాయర్ గత సంవత్సరం మే లో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖా మంత్రి, హైదరాబాద్ ఇంచార్జి మినిస్టర్ శ్రీ పొన్నం ప్రభాకర్ ప్రారంభించారని వివరించారు. అలాగే ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల బోరబండ, రహమత్ నగర్ డివిజన్లోని 52 బస్తీల్లోని ప్రజలకు ప్రత్యామ్నాయ రోజులలో ఉదయం 4.00 గంటల నుండి రాత్రి 11.00 గంటల వరకు నీటి సరఫరా అందిస్తున్నామని ఎండీ చెప్పారు. అయితే ఈ రిజర్వాయర్ పరిధిలో అన్ని ప్రాంతాలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేయడంతో పాటు రాత్రి సమయంలో కాకుండా ఉదయం నుండి సాయంత్రం సమయాల్లో సరఫరా చేసే వీలుగా ఎస్పీఆర్ హిల్స్ రిజర్వాయర్ నుండి బ్రహ్మశంకర్ నగర్ దేవాలయం వరకు 450 మిమీ డయా ఎంఎస్ వాటర్ పైప్ లైన్.. అలాగే బ్రహ్మశంకర్ నగర్ దేవాలయం నుండి కార్మిక నగర్ ఆటో స్టాండ్ వరకు 300 మిమీ డయా ఎంఎస్ డీఐ వాటర్ పైప్ లైన్ నిర్మాణం చేపడున్నామని చెప్పారు. దీంతో పాటు ఈ పైప్ లైన్ నిర్మాణం పూర్తయితే కార్మిక నగర్, బ్రహ్మశంకర్ నగర్ ప్రాంతాలలో రాత్రి వేళల నీటి సరఫరాను నివారించడమే కాకుండా నీటి సరఫరా సైతం మెరుగవుతుందని వివరించారు. అలాగే నగరంలో రాత్రి సమయంలో నీటి సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమయానుసారంగా అన్నీ ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం సమయాల్లో నీటి సరఫరా చేసే విధంగా ప్రణాళికలును రూపొందించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీజీఎం ప్రభు, జీఎంలతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.