by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:37 PM
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2: ది రూల్' సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమా భారత్‌లో రూ.1,230.55 కోట్లు (నెట్) వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల అంచనా. నిన్న కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో 8.05 శాతం ఆక్యుపెన్సీతో పుష్ప-2 టిక్కెట్లు అమ్ముడుపోయాయి.ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 సినిమా రికార్డులను పుష్ప-2 అధిగమించింది. పుష్ప-2 సినిమా రూ.1,800 కోట్ల మార్కును దాటింది. ఈ సినిమా 32 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,831 కోట్ల వసూళ్లను రాబట్టిందని చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో రూ.900 కోట్లు ఉత్తర భారతదేశం నుంచి వచ్చినట్లు తెలిపింది. పుష్ప-2 కంటే ముందు అమిర్ ఖాన్ హీరోగా వచ్చిన 'దంగల్' చిత్రం మాత్రమే రూ.2,000 కోట్లతో ముందుంది. మొదటి రోజు రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టింది.పుష్ప-2 సినిమా త్వరలో ఓటీటీలోకి రానుందని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. విడుదలైన 56 రోజుల కంటే ముందు ఏ ఓటీటీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కాదని చిత్ర బృందం ఇదివరకు ప్రకటించింది. ఈ క్రమంలో జనవరి 31న సినిమాను ఓటీటీలోకి తీసుకు వస్తారనే చర్చ సాగుతోంది. పుష్ప-2 విడుదలైనప్పుడు సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు కాగా, ఆ తర్వాత మరో 20 నిమిషాలు జత చేశారు. ఓటీటీ వర్షన్‌లో మరిన్ని సీన్స్ జత కానున్నాయని తెలుస్తోంది.
Latest News