by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:40 PM
సినీ పరిశ్రమకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అతి పెద్ద చర్చ ఏమిటంటే... ఫేక్ కలెక్షన్స్! మా సినిమాకు వందల కోట్లు వచ్చాయంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. ఈ కలెక్షన్స్ నిజమేనా అనేదానిపై స్పష్టత ఉండడంలేదు. ఈ క్రమంలో ఐటీ అధికారులు టాలీవుడ్ ప్రముఖులపై పడ్డారు. కలెక్షన్లు ఎంత వచ్చాయి? దానికి తగ్గట్టుగా లెక్కలు చూపించారా? అనే కోణంలో రెయిడ్స్ చేస్తున్నారు.గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయంలో వారు సోదాలు జరిపారు. నాలుగు రోజుల ఐటీ సోదాల్లో దిల్ రాజుకు సంబంధించిన పలు కీలక అంశాలను ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆయన ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ టీమ్ ప్రస్తుతం లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు కూతురు హన్సితా రెడ్డి ఇంట్లో కూడా డాక్యుమెంట్లను అధికారులు వెరిఫై చేస్తున్నారు. అటు, పుష్ప-2 సినిమాకు సంబంధించి రూ. 1,800 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. కానీ దానికి తగినట్టుగా పన్నుల చెల్లింపులు జరిగనట్టు ఐటీ అధికారులు గుర్తించారు. నాలుగు రోజులుగా 18 ప్రదేశాల్లో ఐటీ అధికారులు 55 బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహించారు.
Latest News