by Suryaa Desk | Sun, Jan 26, 2025, 12:23 PM
సినీ రంగానికి చేసిన సేవలకు గానూ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు (Balakrishna)కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రకటించింది.తాజాగా దీనిపై ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.''నాకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నా ధన్యవాదాలు. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికీ నా ధన్యవాదాలు. నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటాను'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ఆయన అభినందనలు తెలియచేశారు.కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన నా ప్రియమైన మిత్రుడు నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు అంటూ చిరంజీవి పోస్ట్ పెట్టారు. 'బాలా బాబాయ్‌కి హృదయపూర్వక అభినందనలు. సినిమా రంగానికి మీరు చేసిన అసమాన సేవలకు, నిర్విరామ ప్రజాసేవకు ఇది గుర్తింపు' అంటూ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దర్శకుడు రాజమౌళి, నటులు మహేశ్‌బాబు, మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, విజయ్ దేవరకొండతోపాటు పలువురు ప్రముఖులు బాలకృష్ణను అభినందించారు. ఆయనతో పాటు పద్మ అవార్డులకు ఎంపికైన వారికీ శుభాకాంక్షలు తెలిపారు.
Latest News