by Suryaa Desk | Sat, Jul 13, 2024, 08:45 PM
హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. తెలంగాణ మెుత్తం జనాభాలో దాదాపు కోటి వరకు హైదరాబాద్ నగరంలోనే నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ సమీపంలో కూడా భారీగా అభివృద్ది జరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40 కి.మీ పరిధి వరకు రీజినల్ రింగు రోడ్డు నిర్మామం చేటపట్టున్నారు. ఔటర్ రింగు రోడ్డు హైదరాబాద్ నగరానికి గేమ్ ఛేంజర్ అయితే సూపర్ గేమ్ ఛేంజర్ రీజినల్ రింగ్ రోడ్డు అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిని కూడా పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధి ఏడు జిల్లాల పరిధిలో 7200 చదరపు మీటర్లు విస్తరించి ఉంది. అయితే హైదరాబాద్ నగరానికి నలువైపులా ఆర్‌ఆర్‌ఆర్ పరిధి కలిసేలా హెచ్‌ఎండీఏను విస్తరించాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలిసింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పరిధిని విస్తారించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఫార్మా సిటీ, గ్రీన్ సిటీ, మల్టీ పర్పస్ టవర్స్ నలుమూల నిర్మించి అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న జోన్ల సంఖ్యను పెంచాలని కూడా చూస్తున్నారు.
హెచ్‌ఎండీఏలో ప్రస్తుతం ఘట్‌కేసర్, మేడ్చల్, శంకర్‌పల్లి, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లను కూడా పెంచే కసరత్తు జరుగుతోంది. జోన్ల సంఖ్యను కొత్తగా 6 లేదా 8కి పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో ఏడు జిల్లాల పరిధి కోసం బృహత్తర ప్రణాళిక రూపొందించారు. ఆ గడువు 2030 వరకు ఉంది. మరో 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2050 వరకు పకడ్బందీగా ఇంటిగ్రేటెడ్ మాస్టర్‌ప్లాన్‌కు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు వచ్చే 20 ఏళ్లలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు సంబంధించిన మాస్టర్‌ప్లాన్‌కు హెచ్‌ఎండీఏ రెడీ చేస్తోంది. శాటిలైట్ టౌన్‌షిప్పుల ప్రయోగం కూడా మరోసారి తెరపైకి రానుంది.
ఈనేపథ్యంలో అన్ని స్థాయిల్లో అధికారులు, సిబ్బందిని నియమించే దిశగా హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. హెచ్‌ఏండీఏ పరిధిని విస్తరిస్తే.. రీజినల్ రింగు రోడ్డు వరకు భూముల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశన్నంటగా.. మరింత పెరిగే అవకాశం ఉంది.