by Suryaa Desk | Sat, Jul 13, 2024, 09:59 PM
తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ గూలాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. రేవంత్ రెడ్డి అరికెపూడి గాంధీకి కాంగ్రెస్ పార్టీ కప్పి సాదరంగా ఆహ్వానించారు. గాంధీతో పాటు పలువురు కార్పొరేటర్లు హస్తం గూటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవరాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి తదితరలు పాల్గొన్నారు. కాగా, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్లు శుక్రవారమే గాంధీ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పని చేసేందుకు తాను సిద్ధమైనట్లు వెల్లడించారు. కాగా, గత 15 రోజుల క్రితం నుంచి గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దానం నాగేందర్ చేరిక తర్వాత అప్రమత్తమైన బీఆర్ఎస్ అప్రమత్తమైంది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. పార్టీలో కొనసాగాలని వారి భవిష్యత్తుపై హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ బుజ్జగింపులకు తలొగ్గని ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ కారు దిగి హస్తం పార్టీలో చేరిపోయారు. అయితే వీరి తర్వాత నెక్స్ట్ ఎవరు చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. తమ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించే వరకు చేరికలను ప్రోత్సహిస్తామని కాంగ్రెస్ పెద్దలు ఇది వరకే ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇటీవల ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఒకేసారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు మారిన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఈ చర్యలపై తాము రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. అటు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జూలై 11విచారణ జరగ్గా.. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు విచారణను జూలై 15 వాయిదా వేసింది.