by Suryaa Desk | Sat, Jul 13, 2024, 09:54 PM
బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి క్యూ కట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరుకోగా.. తర్వాత ఎవరూ అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే.. మరో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు.. మొన్నటి వరకు ఈడీ సోదాలతో వార్తల్లో నిలిచిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈరోజు రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మల్యే మహిపాల్ రెడ్డి.. కారు దిగి హస్తం గూటికి చేరుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే.. మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ పెట్టుకున్న వాట్సప్ స్టేటస్.. ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. 2008 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు, అప్పటి కాంగ్రెస్ నాయకులతో దిగిన ఫొటోలను విక్రమ్ రెడ్డి స్టేటస్‌గా పెట్టుకున్నారు. దీంతో.. మహిపాల్ రెడ్డి కారు దిగిపోతున్నారని.. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో.. నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై మహిపాల్ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం.
గతంలోనూ సంగారెడ్డి ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలవగా.. అప్పుడు కూడా ఇలాంటి వార్తలే చక్కర్లు కొట్టటంతో.. వాటిని మహిపాల్ రెడ్డి స్పందించి క్లారిటి ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి ఒక్కసారి కాదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసం 100 సార్లు కలుస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. అయితే... ఇప్పుడు మాత్రం అలాంటి కామెంట్లు ఏమీ చేయకపోవటం.. ఈడీ సోదాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని సైలెంట్‌గా వెళ్లి కలిసి రావటం.. అందులోనూ వరసగా గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు చేరుతున్న సమయంలోనే కలవటం.. పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ మహిపాల్ రెడ్డి హస్తం గూటికి చేరితే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరుకోనుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా.. నిన్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం గూటికి చేరుకోగా.. ఈరోజు అరికెపూడి గాంధీ కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక.. మహిపాల్ రెడ్డి ఎప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుని ఇంట్లో కూడా సోదాలు నిర్వహించటంతో పాటు కేసు కూడా నమోదు చేశారు. మైనింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలుమార్లు విచారించిన తర్వాత.. ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిచారు. లాకర్లలో భారీ మొత్తంలో బంగారం బిస్కెట్లు, రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన పేపర్లను ఈడీ అధికారులు గుర్తించారు. అక్రమ మైనింగ్ ద్వారా మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు సుమారు రూ.300 కోట్లు సంపాధించినట్టుగా ఈడీ అభియోగాలు మోపటంతో పాటు కేసు కూడా నమోదు చేసింది.