by Suryaa Desk | Sat, Jul 13, 2024, 09:00 PM
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పుణ్యమా అని.. ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు చూడాల్సివస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా అమలు చేసిన ఫ్రీ బస్సు పథకాన్ని మహిళలు వందకు వంద శాతం ఉపయోగించుకుంటున్నారు. అందులో భాగంగా.. ఎన్నో వింతలు విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. బస్సుల్లో 100కు 120 శాతం ఆక్సుపెన్సీని టీజీఎస్ ఆర్టీసీ సాధిస్తుండటం ఒక రికార్డయితే.. రోజులు 20 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అందులో 70 శాతం మంది మహిళలే కావటం గమనార్హం.
ఇదంతా ఒక ఎత్తయితే.. బస్సుల్లో సీట్ల కోసం మహిళల సిగపట్లు పట్టుకోవటం, చెప్పులతో కొట్టుకోవటం, ఒంటిపై దుస్తులను కూడా లెక్కచేయకుండా ముష్టి యుద్ధాలు చేస్తున్నారు. ఇక.. ఆర్టీసీ సిబ్బందినైతే.. ఓ ఆట ఆడేసుకుంటున్నారు. కొందరైతే.. వాళ్లపైకి కూడా దాడులకు దిగుతున్నారు. ఇటీవలే ఓ మహిళ.. బస్సులో సీటు దొరకలేదన్న కారణంతో.. ఏకంగా డ్రైవర్ సీటునే ఆక్రమించటం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది.
అయితే.. ఇంత ఆక్యుపెన్సీ ఉంది.. మరి వీళ్లంతా తమ అవసరాలకు అనుగుణంగానే ప్రయాణాలు సాగిస్తున్నారా అంటే.. అబ్బే రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టే.. అవసరం ఉన్నా లేకున్నా ప్రయాణాలు చేస్తున్నారు. ఇంకొందరైతే.. కాలక్షేపానికి కూడా ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రయాణాల్లోనే.. కుట్లు అల్లికలు, బీడీలు చేయటమే కాదు.. కొందరు కూరగాయలు కూడా కట్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
ఇదంతా ఒక ఎత్తయితే.. ఈ ఫ్రీ బస్సు పథకం ఎఫెక్ట్‌తో ఓ మహిళా రైతు అదిరిపోయే ఐడియా ఆలోచించింది. తాను పండించిన కూరగాయలను.. మార్కెట్‌కు తీసుకెళ్తున్న క్రమంలో... బస్సులోనే దుకాణం తెరిచేసింది. ఎలాగూ బస్సులో 70 శాతం మంది మహిళలే ఉండటంతో.. ఆమె కూరగాయలు మార్కెట్ చేరేలోపే అమ్ముడైపోయి.. వ్యాపారం గట్టిగానే గిట్టుబాటైంది.
నిండా ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో కూరగాయల మూటలతో ఓ మహిళ ఎక్కింది. ఆమెను చూసిన బస్సులోని మహిళలు.. ఏమేం కూరగాయలున్నాయని మాటలు కలిపారు. అదే క్రమంలో రేట్లు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎలాగూ.. ఇంటికి వెళ్లిన తర్వాత కూరగాయల కోసం భర్తలను మార్కెట్‌లకు పంపాలనుకున్నారో.. లేదా తక్కువ ధరకే వస్తున్నాయనుకున్నారో.. ఆమెతో భేరాలు మొదలుపెట్టారు. చాలా మందే అడగటంతో.. ఆ మహిళా రైతు కూడా త్రాసు తీసి.. దుకాణం తెరిచేసింది. అడిగినవాళ్లందరికీ అక్కడే తూకం వేసి అమ్మింది.
ఈ సన్నివేశాన్ని బస్సులో వెళుతున్న ప్రయాణికులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే.. ఈ బస్సు ఎక్కడి నుంచి ఎటు వెళ్తుందన్నది అంత క్లారిటీ లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. అయితే.. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటినజ్లు మాత్రం.. సరదాగా స్పందిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో బస్సుల్లో క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తారేమో అని కొందరు అభిప్రాయపడింది.. ఆ మహిళా రైతుకు గట్టిగానే గిట్టుబాటు అయ్యుంటుందని కామెంట్ చేశారు. ముందు ముందు ఇంకెన్ని చిత్రాలు చూడాలో అంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.