by Suryaa Desk | Sat, Aug 10, 2024, 07:35 PM
తెలంగాణలో కనుమరుగైన టీడీపీని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు షురూ చేశారు. ఏపీ ఎన్నికల తర్వాత సీఎం హోదాలో తెలంగాణకు వచ్చిన చంద్రబాబుకు.. ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు బైక్ ర్యాలీతో తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. గతంలో టీడీపీలో పని చేసి.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా ఆయనను వ్యక్తిగతంగా వెళ్లి కలవటం గమనార్హం.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావటంతో.. తెలంగాణలో ఉన్న టీడీపీ మద్దతుదారులు కూడా యాక్టీవ్ అయ్యారు. ఇదే అనువైన సమయంగా భావిస్తున్న చంద్రబాబు.. తమ పార్టీని బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే.. శనివారం (ఆగస్టు 10న) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో.. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయడంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
వీటన్నింటితో పాటు.. తెలంగాణలో పార్టీని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చేందుకు.. సత్తా ఉన్న నేతను టీటీడీపీ కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని చంద్రబాబు బావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే.. కొత్త అధ్యక్షున్ని ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే.. టీటీడీపీ అధ్యక్షుడి బరిలో సీనియర్ నేతలు అరవింద్ కుమార్ గౌడ్, బక్కని నరసింహులు, సామా భూపాల్ రెడ్డి, నందమూరి సుహాసిని, కాట్రగడ్డ ప్రసూన ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే.. తెలంగాణ పార్టీ పగ్గాలను తన కోడలికే ఇస్తారని సోషల్ మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాబు అరెస్టయిన సమయంలో ఏపీలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన ఆయన కోడలు నారా బ్రాహ్మణికే పార్టీ పగ్గాలు అప్పజెప్పనున్నారంటూ తెగ ప్రచారం జరిగింది. అయితే.. నిజానికి అధ్యక్ష బరిలో ఉన్నది.. బాబుకు కోడలి వరస అయ్యే నందమూరి సుహాసిని. ఆమెకు పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉండగా.. శ్రేణులు మాత్రం బ్రాహ్మణికి ఇస్తారని ప్రచారం చేశారు.
అయితే.. గత ఎన్నికల్లో టీడీపీ తరపున కూకట్‌పల్లి నుంచి బరిలోకి దిగిన సుహాసిని ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. కాగా.. నందమూరి కుటుంబానికి పార్టీలో సముచిత స్థానం కల్పించట్లేదంటూ వస్తున్న విమర్శల నేపథ్యంలో.. తెలంగాణలో నామమాత్రంగా ఉన్న పార్టీ బాధ్యతలైనా సుహాసినికి అప్పజెప్తే.. కొంచెమైనా ఆ విమర్శలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే.. గతంలో సీనియర్ నేత అని బాధ్యతలు ఇస్తే.. కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న నేపథ్యంలో.. పార్టీలోని సీనియర్ నేతలకు పగ్గాలు అప్పజెప్తుతారా.. లేదా కోడలికే ఇస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.