by Suryaa Desk | Sat, Aug 10, 2024, 08:11 PM
తెలంగాణకు చెందిన ఓ ప్రముఖుడు తన కుమారుడి వివాహాన్ని రాజస్థాన్‌లోని జైపూర్‌లో నిర్వహించారు. ఈ సమయంలో కోటిన్నర విలువైన నగలతో ఉన్న బ్యాగు చోరీకి గురయ్యింది. కుటుంబమంతా పెళ్లి వేడుకల్లో మునిగిపోవడంతో చోరుడు చేతివాటం ప్రదర్శించాడు. కొద్దిసేపటి తర్వాత తమ బ్యాగు చోరీకి గురయినట్టు తెలిసి బాధితులు షాకయ్యారు. దీంతో బ్యాగు కోసం వెదికిన ఆ కుటుంబం.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. గురువారం రాత్రి జైపూర్‌లోని ముహానా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణకు చెందిన వ్యక్తి (61) తన కుమారుడి వివాహం కోసం రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలోని ముహనా ప్రాంతంలో ఓ ఖరీదైన హోటల్‌ను బుక్ చేశారు. గురువారం రాత్రి వివాహం జరగడంతో వధూవరులు, కుటుంబసభ్యులు, అతిథులు వేడుకల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 11.20 గంటల ప్రాంతంలో వరుడి తల్లి కళ్యాణ వేదిక వద్ద నగలు, రూ.లక్ష నగదు ఉన్న బ్యాగును పెట్టింది. ఇంతలో వేరే పని కోసం అక్కడ నుంచి ఆమె వెళ్లడంతో ఇదే అదునుగా భావించిన దొంగ ఆ బ్యాగును ఎత్తుకెళ్లాడు.
కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన తర్వాత బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైనవాళ్లు చుట్టుపక్కలా వెతికారు. బ్యాగు చోరీకి గురయినట్టు గుర్తించి.. వెంటనే అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. 13 నుంచి 14 ఏళ్ల వయసుస్న బాలుడు ఆ బ్యాగును ఎత్తుకెళ్లడం అందులో రికార్డయ్యింది. మరో వ్యక్తితో కలిసి బ్యాగు తీసుకుని అక్కడ నుంచి జారుకున్నాడు.
బ్యాగులో దాదాపు రూ.1.42 కోట్ల విలువచేసే నగలు, రూ.లక్ష నగదు ఉందని ఫిర్యాదులో తెలిపారు. బంగారు గాజులు, నెక్లెన్, వజ్రాలహారం, ఇతర విలువైన ఆభరణాలు బ్యాగులో ఉంచినట్టు బాధితులు పేర్కొన్నారు. ‘పెళ్లి జరుగుతోన్న హాల్‌లోకి వచ్చిన అనుమానితుడు.. మహిళ పట్టుకున్న బ్యాగునే చూస్తూ ఉన్నాడు. రాత్రి 11.20 గంటలకు మండపంలో బ్యాగును పెట్టి పక్కవెళ్లడంతో క్షణాల్లో ఎవరి కంటబడకుండా దానిని తీసుకుని వెళ్లిపోయాడు’ అని అధికారులు తెలిపారు. నగలు దొంగలించిన మైనర్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.