by Suryaa Desk | Wed, Sep 25, 2024, 08:45 PM
తెలంగాణలో మళ్లీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో దంచికొట్టిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. మళ్లీ గత నాలుగు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఏడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పాటుగా ఈదురు గాలులు వీస్తాయన్నారు. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో పాటుగా పిడుగులు పడే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇక మంగళవారం పలు జిల్లా్ల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా జనగామ జిల్లా దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షం కురిసిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లా కామారెడ్డి గూడెంలో 10.9 సెం.మీ, తిమ్మాపూర్‌లో 9.9 సెం.మీ, శాలి గౌరారంలో 9.1 సెం.మీ, రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో 8.9 సెం.మీ. వర్షపాతం నమోదనైట్లు చెప్పారు. నేడు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రజలకు అధికారులు సూచించారు.
హైదరాబాద్‌లోని పలుచోట్ల మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. భారీ గాలులతో కూడిన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. దీంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్, పంజాగుట్ట, మియాపూర్, కొండాపూర్, మాదాపూర్, అమీర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
దీంతో రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరింది. రోడ్లు జలమయం కావటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మాదాపూర్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, కోఠి సహా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని.. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజలకు హెచ్చరించారు. ఎమర్జెన్సీ కోసం 040-21111111, 90001 13667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.