by Suryaa Desk | Wed, Sep 25, 2024, 08:46 PM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వినియోగం అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మనం తినే నెయ్యి, నూనెల వినియోగంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజంగా మార్కెట్‌లో దొరికే నెయ్యి, నూనెలు స్వచ్ఛమైనవేనా..? హోటళ్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లలో ఉపయోగించే నూనెలు ఆరోగ్యకరమైనవేనా..? అనే క్వశ్చన్ అందరి మదిలోనూ మెుదులుతోంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్ శివారులో వెలుగు చూస్తున్న కల్తీ నెయ్యి, నూనె తయారీ కేంద్రాలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. రాజధానితోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో దాదాపుగా 70 నుంచి 100 వరకు కల్తీ నెయ్యి కేంద్రాలు ఉన్నట్లు తెలిసింది. కుళ్లిన జంతువ్యర్థాలతో నెయ్యి, నూనెలు తయారు చేసి బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి విక్రయిస్తున్నట్లు తేలింది.
హైదరాబాద్‌తోపాటుగా సమీప జిల్లాల్లో ఈ కల్తీ దందా పెద్దఎత్తున జరుగుతోంది. పాతబస్తీలోని పలు ప్రాంతాలు, ప్రగతినగర్ కాలనీ, శాస్త్రిపురం రైల్వేస్టేషన్ పొడవునా కల్తీ నెయ్యి, నూనెల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జల్‌పల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, పరిగి, కొందుర్గు, కడ్తాల్ వంటి శివారు అటవీ ప్రాంతాల్లోఈ కల్తీ నెయ్యి, నూనెల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా కొండలు, గుట్టల మధ్య ఏర్పాటు చేసి వాటిని తయారు చేస్తున్నట్లు తేలింది. జంతువుల వ్యర్థాలతో కల్తీ నెయ్యి, వంటనూనెలు తయారు చేసి దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. బ్రాండెడ్ సంస్థలకు చెందిన నెయ్యి, వంటనూనెల్లో వీటిని కల్తీ చేసి విక్రయాలు సాగిస్తున్నారు.
ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా ఈ కల్తీ నెయ్యి, నూనెలను తయారు చేస్తున్నారు. జంతువ్యర్థాల్లో ఎక్కువగా గొడ్డు మాంసానికి సంబంధించినవే ఉంటున్నాయి.అంబర్‌పేట, రామ్‌నాస్‌పుర, చెంగిచర్ల, జియాగూడ కబేళాల నుంచి జంతువ్యర్థాలను సేకరిస్తున్నారు. తయారీ ప్రాసెస్‌లో ఆ వ్యర్థాలను రెండు రోజులపాటు అలాగే వదిలేస్తారు. దీంతో అవి పూర్తిగా కుళ్లిపోయి వాటిలో నుంచి పురుగులు బయటకు వస్తాయి. అలా పూర్తిగా కుళ్లిన వ్యర్థాలను పెద్ద పెద్ద బాండీల్లో వేసి 2 నుంచి 3 రోజులపాటు రాత్రింబవళ్లు మరిగిస్తారు. ఇలాచేయటం వల్ల వ్యర్థాల్లో ఉన్న ఎముకలు, కొవ్వు వంటి పదార్థాలు కరిగి పేస్టులాగా తయారవుతుంది.
కల్తీ చేసినట్లు అనుమానం రాకుండా ఆ పేస్టులో సువాసన కోసం కొన్నిరకాల కెమికల్స్ కలుపుతున్నారు. చివరకు పేస్టును చల్లార్చి 20 లీటర్లు, 40 లీటర్ల డబ్బాల్లో నింపుతారు. ఈ డబ్బాలపై బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను అతికించి మార్కెట్‌లోకి పంపిస్తారు. తయారీ కేంద్రాల్లో 20 లీటర్ల డబ్బా రూ.300కే విక్రయిస్తున్నారు. అలా తక్కువ ధరకు కల్తీ నెయ్యి, నూనెలను కొనుగోలు చేసి చివరకు హోల్‌సేల్ వ్యాపారులకు అమ్ముతారు. కొంతమంది వీధి వ్యాపారులు, చిన్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిర్చి బండ్ల వ్యాపారులు వీటినే తక్కువ ధరకు కొనుగోలు ఆహార పదార్థులు తయారు చేస్తున్నారు. కొన్ని హోటళ్లలో బిర్యానీలు వంటి వాటి తయారీకి ఈ కల్తీ నెయ్యినే ఉపయోగిస్తున్నారు. ఒక్కో తయారీ కేంద్రంలో ప్రతి వారం 50-60 టన్నులు కల్తీ నెయ్యి, నూనెలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిసింది.
ఇవి తింటే ప్రాణాలకే ముప్పు..
కల్తీ నెయ్యి, నూనెలతో చేసిన పదార్థాలను తింటే ప్రాణాలకే ముప్పు అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండె సంబంధిత వ్యాధులు, పక్షవాతం లాంటి సమస్యలు, పెద్దపేగు క్యాన్సర్లు వస్తాయని చెబుతున్నారు. టేప్ వర్మ్, సిస్టోసర్కోసిస్ పరాన్నజీవులు మెదడు, కాలేయం, పేగుల్లోకి చేరతాయని అంటున్నారు. గుండె నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ చేరి హార్ట్ ఎటాక్‌లకు కారణం అవుతాయని అంటున్నారు. బ్రెయిన్ హెమరేజ్ కారణంగా పక్షవాతం వచ్చి కాళ్లు, చేతులు, మాట పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో దొరికే చాలా వరకు నెయ్యు, నూనెలతో చేసిన పదార్థాలను తినటం ద్వారా కల్తీని గుర్తించలేమని అంటున్నారు. అందుకే బయట ఫుడ్స్ తినకుండా ఇంట్లో వండిన ఆహార పదార్థాలు తినడం మేలని సూచిస్తున్నారు.