by Suryaa Desk | Thu, Sep 26, 2024, 04:01 PM
మా అమ్మమ్మ - తాతయ్యల జ్ఞాపకార్థం బడిని కట్టించాను.. గుడిని కూడా కట్టిస్తాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.రాజకీయాలకు అతీతంగా గుడిని నిర్మించి, కొదురుపాక ప్రజలకు అంకితం చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో కేశవరావు – లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం తన సొంత ఖర్చులతో నిర్మించిన స్కూల్ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈరోజు ఒక శుభదినం. చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్లలో నివాళులర్పించి వచ్చాను. కొదురుపాకకు రాజకీయ నాయకుడిలా రాలేదు.. కేశవరావు – లక్ష్మమ్మ మనువడిగా మాత్రమే వచ్చాను. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రతి ఎండాకాలం సెలవుల్లో ఇక్కడికే వచ్చేవాడిని. బడి మంచిగనే కట్టించారు.. గుడి కూడా పూర్తి చేయాలని మా మామ చెప్పారు. దాన్ని కూడా పూర్తి చేసి రాజకీయాలకు అతీతంగా అంకకితం చేస్తాం. కొదురుపాకకు వచ్చే వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. గతంలో వాగు పొంగితే రాకపోకలు బంద్ అయ్యేవి. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వచ్చే పరిస్థితి లేకుండే. వాగు పెద్దగా లేనప్పుడు నీళ్లల దాటుకుంటూ వచ్చేవాళ్లమని కేటీఆర్ గుర్తు చేశారు.
కొదురుపాక గ్రామం మిడ్ మానేరులో మునిగిపోతుందన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మా నానమ్మ ఊరు అప్పర్ మానేరులో మునిగిపోయింది. లోయర్ మానేరులో ఇంకో అమ్మమ్మ ఊరు మునిగిపోయింది. మూడు మానేరు డ్యామ్‌ల్లో మా మూడు రక్త సంబంధీకుల ఇండ్లు పోయాయి. కాబట్టి నిర్వాసితుల బాధలు తెలుసు. నిర్వాసితుల సమస్యలను సాధ్యమైనంత వరకు షరిష్కరించినం. మిగిలిన వారికి ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తాం. కొదురుపాకలో బడి పూర్తి కావడంతో మా తాత ఆత్మ సంతోషిస్తదని అనుకుంటున్నాను. కొదురుపాక ఊరికి నా వ్యక్తిగతంగా ఎల్లవేళల అండగా ఉంటాను. గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి.. రాజకీయాలకు అతీతంగా సఖ్యతగా ప్రారంభించుకుందామని కేటీఆర్ పేర్కొన్నారు.