by Suryaa Desk | Thu, Oct 10, 2024, 07:46 PM
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో భక్తి శ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ సంబురాలతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలు వెలుగులీనుతున్నాయి. వందలాది మంది మహిళలు ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడుతున్నారు.వేలాది మంది మహిళలతో హనుమకొండ పద్మాక్షి అమ్మవారి గుండం కిక్కిరిసిపోయింది. వికారాబాద్ జిల్లా తాండూరులో మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. కరీంనగర్, నల్గొండ, అదిలాబాద్ తదితర జిల్లాల్లో బతుకమ్మ సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు నేటితో ముగియనున్నాయి.