by Suryaa Desk | Sat, Nov 16, 2024, 07:44 PM
ఇటీవల కాలంలో రకరకాల మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రజల అత్యాశే పెట్టుబడిగా కొందరు మోసాలు చేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా.. బైబ్యాక్ స్కీమ్స్, బంగారంపై పెట్టుబడులు పెట్టి భారీగా లబ్ధి పొందొచ్చునని గాలమేసిన కేటుగాళ్లు వందల కోట్లు కొట్టేశారు. ఒకటి కాదు.. రెండు కాదు రూ.300 కోట్లు కొట్టేశారు. 3,600 మంది నుంచి అందినంత దండుకొని మోసానికి పాల్పడ్డాడు. ఈ ముఠాలోని ఎనిమిది మందిని సైబరాబాద్ ఆర్థిక నేరాల పరిశోధన విభాగం పోలీసులు అరెస్టు చేశారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కలిదిండి పవన్ కుమార్ అనే వ్యక్తి వెల్త్ క్యాపిటల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నగరంలో ఓ సంస్థ ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన రావుల సత్యనారాయణ, పగడాల రవి కుమార్‌రెడ్డి, కొల్లాటి జ్యోతి, బి.హరికృష్ణ, వల్లూరు భాస్కర్‌రెడ్డి, కె.మౌనిక, కర్కుల లావణ్యలతో పవన్ ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. బై బ్యాక్ ఓపెన్ ప్లాట్ స్కీమ్‌తో ఓ ఆఫర్ తీసుకొచ్చారు. స్కీమ్‌లో భాగంగా రూ.8 లక్షల పెట్టుబడితో రెండు గుంటల ఖాళీ జాగా కొనుగోలు చేయడం ద్వారా నెలకు 4 శాతం వడ్డీ కూడా పొందవచ్చునని చెప్పారు. 25 నెలల పాటు రూ.32 వేలు పొందొచ్చని నమ్మించి అనేక మందిని ఈ స్కీమ్‌లో చేర్పించారు.
ఇక డబుల్ గోల్డ్ స్కీమ్ పేరిట పెట్టుబడి పెడితే ఒక ఏడాది తర్వాత దానికి రెట్టింపు బంగారం అందజేస్తామని ఈ ముఠా సభ్యులు నమ్మించారు. ప్రజల్లో నమ్మకం కుదిరేలా గోల్డ్ బాండ్‌లు కూడా ఇచ్చారు. గోల్డ్ చిట్స్ స్కీమ్ కింద రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు రూ.15 వేలు ఇవ్వటంతో పాటుగా.. గడువు ముగిశాక మొత్తం రూ.8 లక్షలు చెల్లిసామని మరో స్కీం ప్రకటించారు. ఇలా దాదాపుగా 3,600 మంది నుంచి రూ.300 కోట్లకుపైగా ప్రజల నుంచి వసూలు చేశారు. ఆ తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వటం మానేశారు. దీంతో కేపీహెచ్‌బీకి చెందిన హరికంఠ అనే బాధితుడు పోలీసులను ఆశ్రయించగా.. దర్యాప్తు చేపట్టి శుక్రవారం నిందితులను అరెస్టు చేశారు. ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.