![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 11:26 AM
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) నుంచి భూములను లాక్కొని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏవో వెంచర్లు, ప్లాట్లు వేసి అమ్ముకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అబద్ధాల మీదే బతుకుతున్న కొన్ని రాజకీయ పార్టీలు కంచ గచ్చిబౌలి ప్రాంతంలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు.ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తెచ్చుకోవాలని గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రయత్నాలు చేయలేదని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ భూములు వెనక్కి తెచ్చామని అన్నారు. ఈ 400 ఎకరాలు విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉందని హెచ్‌సీయూ భావించిందని, కానీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని, ప్రైవేటు సంస్థకు బదలాయించిందని తెలిపారు. బదులుగా విశ్వవిద్యాలయాన్ని ఆనుకొని ఉన్న 397 ఎకరాలను హెచ్‌సీయూకు కేటాయించారని తెలిపారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ రికార్డులు, యాజమాన్యాలు చేసిన సంతకాలతో ఆధారాలు ఉన్నాయని తెలిపారు.తెలంగాణ ప్రజలకు, విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈ విషయం తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కావాలని దుష్ప్రచారం చేస్తూ ప్రజలను, విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.ప్రైవేటు సంస్థకు ఇచ్చిన భూముల కేటాయింపును 2006లో నాటి ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. దీనిపై ఆ ప్రైవేటు సంస్థ హైకోర్టుకు వెళ్లిందని, కానీ అది ప్రజల ఆస్తి కాబట్టి నాటి నుంచి పోరాడుతూ వస్తున్నామని అన్నారు.ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిందని, కానీ ఈ భూముల వ్యవహారాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ భూముల వ్యవహారంపై కోర్టులో పోరాడి, వెనక్కి తెచ్చుకున్నామని చెప్పారు.ఈ 400 ఎకరాలను కాపాడి అక్కడ కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా ఒక కార్యాచరణను రూపొందించి ముందుకు సాగుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. 400 ఎకరాలు సాధించడం ఈ ప్రభుత్వ విజయమని, తెలంగాణ ప్రజల విజయమని ఆయన వ్యాఖ్యానించారు.