![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:28 AM
మై హోమ్ గ్రూప్‌పైకి బుల్డోజర్లు పంపే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. మైం హోమ్ గ్రూప్‌నకు బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో (హెచ్‌సీయూ) భూములు అప్పగించారనే ఆరోపణలను ఆమె మిలీనియం జోక్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు చేస్తోన్న ఆరోపణలు నిజమే అయితే బుల్డోజర్లు పంపించాలని డిమాండ్ చేశారు.మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ బీజేపీతో ఉన్నారని, ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పక్కన కూర్చుంటారని ఆమె అన్నారు. అలాంటి పెద్ద వ్యక్తి మీదకు హైడ్రా బుల్డోజర్లను పంపించాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లు, మూగజీవాల పైకి వెళుతున్న బుల్డోజర్లు పెద్దల మీదకు ఎందుకు వెళ్లడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. 400 ఎకరాల హెచ్‌సీయూ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆమె స్పష్టం చేశారు. ఆ భూముల విషయంలో కేసీఆర్ దిశా నిర్దేశం చేశారని, న్యాయవాదులు కోర్టులో బలంగా వాదనలు వినిపించారని తెలిపారు.అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును కోల్డ్ స్టోరేజీకి పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్క్రీన్ ప్లే రచించిందని కవిత ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళతానని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి, ఈరోజు ఢిల్లీలో బీసీ సంఘాలు నిర్వహించిన ఆందోళనకు హాజరై అఖిల పక్ష సమావేశాన్ని పక్కదారి పట్టించారని విమర్శించారు. అఖిల పక్ష నాయకులు రిజర్వేషన్ల పెంపుపై నిలదీస్తే కేంద్రం ఏదో ఒకటి చేయాలని, కానీ కేంద్రం ఇరుకున పడకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి పక్కదారి పట్టించారని ఆమె దుయ్యబట్టారు.బీసీ సంఘాల ఆందోళనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు హాజరు కాలేదని ఆమె ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దారుణాలపై రాహుల్ గాంధీ పెదవి విప్పడం లేదని మండిపడ్డారు. ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని కవిత పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. 400 ఎకరాల భూములను విక్రయించి సర్కారును నడపాలని చూస్తున్నారని ఆరోపించారు. గచ్చిబౌలి ప్రాంతం ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌లా తయారయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.