![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 10:24 AM
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకే మామునూరు విమానాశ్రయానికి కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా, రాష్ట్రంలో మరో విమానాశ్రయానికి భారత వాయుసేన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఇది శుభవార్త అని ఆయన పేర్కొన్నారు.ఇంతకుముందు మామునూరు విమానాశ్రయానికి అనుమతులు సాధించిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు ఆదిలాబాద్ విమానాశ్రయానికి కూడా అనుమతులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆరు నెలల వ్యవధిలోనే రెండు విమానాశ్రయాలకు అనుమతులు రావడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవిశ్రాంత కృషికి దక్కిన విజయమని అన్నారు.ఈ విమానాశ్రయాన్ని పౌర విమానాలు, ఎయిర్ ఫోర్స్ విమానాల రాకపోకలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని వాయుసేన సూచించినట్లు మంత్రి తెలిపారు. అవసరమైన భూమిని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించాలని అధికారులు లేఖలో సూచించారని వెల్లడించారు. తెలంగాణలో విమానాశ్రయాల అనుమతుల మంజూరుకు సహకరిస్తున్నందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.