|
|
by Suryaa Desk | Tue, Feb 10, 2026, 09:05 PM
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి అధికారులతోపాటు గత ప్రభుత్వం ప్రతిపక్షాలు, జర్నలిస్ట్‌లు, సినిమా సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసిందంటూ అధికార కాంగ్రెస్ పార్టీ కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును తీవ్రంగా పరిగణించిన రేవంత్ రెడ్డి సర్కార్.. విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను కూడా ఏర్పాటు చేసింది. ఈ సిట్ గతంలో పనిచేసిన అధికారులతోపాటు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ చేసిన అక్రమ ఫోన్ ట్యాపింగ్‌ను.. ఇప్పటికీ ఆ పార్టీ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందని తెలిపారు. కొంతమంది వ్యక్తులు చట్టవిరుద్ధంగా ఇతరుల పర్సనల్ సంభాషణలను వింటున్నారని.. ప్రజాస్వామ్యంలో ఇది తీవ్ర నేరంగా పరిగణిస్తారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. టెక్నాలజీని తప్పుడు విధానాలకు ఉపయోగిస్తూ.. రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తాను కేవలం ఆరోపణలు మాత్రమే కావని పేర్కొన్న పొంగులేటి.. తాను ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన ఫోన్ కాల్ వివరాలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతామధుకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనడానికి ఇదే సాక్ష్యమని తెలిపారు. తమ సొంత పార్టీ కార్పొరేటర్లతో తాను నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్‌లో తాను ఏం మాట్లాడాను అనేది ట్యాపింగ్ చేసి విన్నారని ఆరోపించారు. తాను ఉద్యోగ సంఘం నేతలతో మాట్లాడిన మాటలను వారు ఎలా విన్నారో విచారణ చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ అగ్రనేతల వద్ద ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేసే డివైజ్‌లు ఉన్నాయని పొంగులేటి ఆరోపించారు.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తమ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. గులాబీ నేతలు ఏ మామిడి తోటల్లోనో.. ఫామ్‌హౌస్‌లలోనో ఫోన్ ట్యాపింగ్ డివైజ్‌లను పెట్టి.. అక్రమంగా ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారని.. వాటిపై దర్యాప్తు చేపట్టి.. నిందితులను గుర్తించి.. వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు, న్యాయమూర్తులు, బిజినెస్‌మెన్‌లు, జర్నలిస్ట్‌లు, సెలబ్రెటీలు.. చివరికి భార్యభర్తల ఫోన్లను కూడా బీఆర్ఎస్ నేతలు అప్పట్లో ట్యాప్ చేశారని ఆరోపించారు.