by Suryaa Desk | Tue, Jan 21, 2025, 02:48 PM
ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మారుతి దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హారర్ రొమాంటిక్ కామెడీ జానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం విడుదల తేదిపై అందరిలో మరోసారి కన్‌ఫ్యూజన్ ప్రారంభమైంది. ఇంతకు ముందే ఓసారి అనుకున్న విడుదల తేదీని వాయిదా వేస్తూ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. అయితే తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో సినిమా రిలీజ్ డేట్ లేకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అంతేకాదు సోషల్ మీడియాలో 'రాజా సాబ్' విడుదల వాయిదా పడినట్లుగా న్యూస్ చక్కర్లు కొడుతోంది.ఈ వార్తను చిత్రయూనిట్ ఇప్పటి వరకు కొట్టిపారేయలేదు. దీంతో ఇక రిలీజ్ వాయిదా పడినట్లేనని అభిమానులు నిర్ణయించుకున్నారు. అంతేకాదు 2025 జూలై 18న చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతున్నట్లు మరో న్యూస్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మొదటిసారి ప్రభాస్ చేస్తున్న ఈ హారర్ కామెడీ జోనర్ చిత్రాన్ని మారుతి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రతి విషయంలో ఆయన ఎంతో కేర్ తీసుకుని చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్ విషయంలో మాత్రం జాప్యం జరుగుతోంది. సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌కు కూడా ప్రాధాన్యత ఉండటంతో నిర్మాణానంతర పనులకు కూడా సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే లేట్ అయినా సినిమా మాత్రం లెటేస్ట్‌గా ఉండి, ప్రభాస్ కెరీర్‌లో 'రాజా సాబ్' మరపురాని చిత్రంగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Latest News