![]() |
![]() |
by Suryaa Desk | Fri, Feb 07, 2025, 05:11 PM
నేషనల్ క్రష్ ట్యాగ్‌ని ఉద్దేశించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి రష్మిక . వయసుతో సంబంధం లేకుండా తాను ఇప్పుడు అందరి ప్రేమాభిమనాలు సొంతం చేసుకుంటున్నానని అన్నారు. సినీ ప్రియుల ప్రేమను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.‘‘2016లో నటించిన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’ విడుదలైనప్పటి నుంచి నేషనల్ క్రష్ అనే టైటిల్ మొదలైంది. అంతకంటే ముందు, చదుకునే రోజుల్లో కాలేజీ మొత్తానికి నేనే క్రష్‌ని. ఆ తర్వాత కర్ణాటక క్రష్.. సినిమాల్లోకి వచ్చాక నేషనల్ క్రష్ అయ్యా. యువతతోపాటు ప్రేక్షకులందరూ నన్ను అమితంగా ఇష్టపడటం చూస్తుంటే ‘నేషనల్ క్రష్’ అనే దశ నుంచి ముందుకు వచ్చినట్లు ఉంది. ఇప్పుడెవరైనా ప్రేక్షకులు నన్ను కలిసి.. ‘‘ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే ఉన్నారు’’ అని చెబుతుంటే నాకెంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేక్షకుల జీవితాల్లో భాగమైపోయాననిపిస్తుంది’’ అని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు.
రష్మిక ప్రస్తుతం ‘ఛావా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించారు. శంభాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. ఫిబ్రవరి 14న ఇది విడుదల కానుంది. ఈ సినిమాలో యాక్ట్ చేయడం గురించి రష్మిక మాట్లాడారు.
‘‘యేసు బాయి పాత్రలో యాక్ట్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. తొలుత ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయా. దక్షిణాదికి చెందిన నాకు మహారాష్ట్ర మహారాణి పాత్రలో నటించడానికి అవకాశం వచ్చిందంటే నమ్మలేకపోయా. కెరీర్ పరంగా ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన మూవీ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు లక్ష్మణ్ సర్‌కు ధన్యవాదాలు. జీవితాంతం గుర్తుండిపోయే ఇలాంటి పాత్రలో నటించిన తర్వాత యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పినా ఫర్వాలేదనిపిస్తుంది (నవ్వులు). ఈ రోల్ కోసం ఎంతో శ్రమించా. భాష నేర్చుకోవడానికే కొన్ని నెలలు కేటాయించా’’ అని తెలిపారు. రష్మిక ప్రస్తుతం వరుస సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ‘కుబేర’, ‘సికందర్’, ‘థామా’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్ బో’ చిత్రాలు చిత్రీకరణలో ఉన్నాయి.