![]() |
![]() |
by Suryaa Desk | Fri, Feb 07, 2025, 05:17 PM
నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్’ (Thandel). సాయిపల్లవి (Sai Pallavi) కథానాయిక. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకువచ్చిన సందర్భంగా చైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఇన్‌స్టా స్టోరీస్‌లో తండేల్ పోస్టర్ షేర్ చేసిన ఆమె.. సినిమా రిలీజ్‌పై ఆనందం వ్యక్తంచేశారు. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ‘‘ఈ సినిమా మేకింగ్ సమయంలో మీరు చాలా ఫోకస్, పాజిటివ్‌గా ఉండటం నేను చూశాను. ఈ అద్భుతమైన ప్రేమకథా చిత్రాన్ని అందరితోపాటు నేను కూడా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’’ అని ఆమె పేర్కొన్నారు. దీనిపై చైతన్య స్పందిస్తూ.. ‘‘థాంక్యూ బుజ్జితల్లి’’ అని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లగా, పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో నాగచైతన్య తండేల్ రాజుగా.. సాయిపల్లవి బుజ్జితల్లి పాత్ర పోషించారు. ఇందులో చైతన్య పొడవాటి జుత్తు, గడ్డంతో కనిపించనున్నారు. తండేల్ రాజు పాత్ర కోసం సుమారు తొమ్మిది నెలల పాటు సన్నద్ధమయ్యారు. 2023లో ఈ సినిమా పట్టాలెక్కిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ సినిమా ఓకే చేసిన నాటినుంచి గడ్డంలోనే ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రమోషన్స్‌లోనూ గడ్డంతోనే పాల్గొన్నారు.చై-శోభిత ఎంతోకాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. గతేడాది డిసెంబర్ నెలలో వీరి పెళ్లి జరిగింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూల్లో చైతన్య.. తన సతీమణిని ఉద్దేశించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శోభిత తెలుగు చక్కగా మాట్లాడుతుందని.. భాషాపరమైన విషయాల్లో ఆమె సాయం తీసుకుంటానని అన్నారు. అంతేకాకుండా శోభితకు ఫ్యాషన్‌పై అభిరుచి ఎక్కువని.. తనకు కూడా ఆమె దుస్తులు కొనుగోలు చేస్తుందని చెప్పారు. అన్ని విషయాల్లో ఆమె నిర్ణయాన్ని తీసుకుంటానని తెలిపారు. చైతన్య కుటుంబానికి ఎంతో విలువ ఇస్తుంటారని అది తనకెంతో నచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శోభిత చెప్పారు.