![]() |
![]() |
by Suryaa Desk | Fri, Feb 07, 2025, 08:16 PM
తన కొత్త సినిమా ‘తండేల్’ (Thandel) విజయం పట్ల నాగచైతన్య (Naga Chaitanya) ఆనందం వ్యక్తం చేశారు. ఆ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ అనంతరం మీడియాతో మాట్లాడారు. చైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చైతన్య, చందూ, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు సందడి చేశారు.
నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఎన్నో మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. ఇంత పాజిటివిటీ చూసి ఎంతో కాలమైంది. నేను మిస్ అయింది మళ్లీ తిరిగొచ్చింది. మార్నింగ్ నుంచి హిట్ టాక్‌తో సినిమా ప్రదర్శితమవుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా ఎక్కువ మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని ఆశిస్తున్నా. వారికి నచ్చే అంశాలెన్నో ఇందులో ఉన్నాయి. వాళ్లు చూస్తే ఈ సినిమాకి మరింత మంచి పేరు వస్తుందని నమ్ముతున్నా. నా నటనకు వచ్చే ప్రశంసల్లో సగం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కే దక్కుతాయి. అంత బాగా నేపథ్య సంగీతం అందించాడు. ‘బుజ్జి తల్లి’ పాట మరో వెర్షన్ ఇవ్వడం వల్ల క్లైమాక్స్ మరో స్థాయికి వెళ్లింది. నన్ను నమ్మి ఈ సినిమా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.