![]() |
![]() |
by Suryaa Desk | Sun, Feb 09, 2025, 10:47 PM
విష్వక్సేన్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న చిత్రం లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఎంతో ఎనర్జీ లభిస్తుందని తెలిపారు. "మొన్న ఓ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు విష్యక్సేన్ భలే సమాధానం చెప్పాడు. మీరు బాలకృష్ణ కాంపౌండ్ కదా మరి చిరంజీవి వైపు వచ్చారేంటి అని ప్రశ్నిస్తే మా ఇంటికి కాంపౌండ్ ఉంది కానీ ఫిలిం ఇండస్ట్రీకి కాంపౌడ్ లేదు అని చక్కగా బదులిచ్చాడు. అందుకు విష్వక్సేన్ ను అభినందిస్తున్నాను. మనుషులన్నాక వేరే వాళ్లపై అభిమానం, ప్రేమ ఉండకూడదా నాపై ఆప్యాయత, అనురాగం ఉండకూడదా.మా ఇంట్లోనే చూసుకుంటే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంతమాత్రాన వాడి ఫంక్షన్ కు నేను వెళ్లకూడదా, వాడితో కలిసి ఉండకూడదా, వాడితో కలిసి భోంచేయకూడదా చిత్ర పరిశ్రమలో హీరోలు ఎవరికి వారే గిరి గీసుకుని ఉన్న రోజులు గతంలో నిజంగా ఉన్నాయి. అది షూటింగుల వరకే. కానీ, అభిమానులు హీరోల మధ్య నిజంగానే సఖ్యత లేదనుకుని కొట్టుకుచచ్చేవాళ్లు, వాల్ పోస్టర్లు చించేసేవాళ్లు. నెల్లూరులో మా కజిన్స్ ఉండేవాళ్లు. వాళ్లిద్దరూ సొంత అన్నదమ్ములు. కానీ ఒకరు రామారావు గారిని, మరొకరు నాగేశ్వరరావు గారిని అభిమానించే వాళ్లు. వాళ్లిద్దరూ ఒకరోజు రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. అప్పుడు నేను చిన్నపిల్లవాడ్ని. సినిమా వాళ్లు బాగానే ఉంటారు కానీ, అభిమానులు కొట్టుకుచస్తారని అర్థమైంది. నేను హీరోని అయ్యాక హీరోల మధ్య సఖ్యత, సుహృద్భావ వాతావరణం ఉండాలనే ఆలోచన బలంగా ఏర్పడడానికి ఆ ఘటన ఒక కారణం. మద్రాస్ లో అప్పట్లో హనీహౌస్ అని ఉండేది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు చెందిన వారు ఏ సందర్భం వచ్చినా ఆ హనీహౌస్ లో పార్టీలు, ఫంక్షన్ లు చేసుకునేవారు. నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణలతోనేను ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాను. ఇటీవలే బాలయ్య 50 ఏళ్ల సినీ జీవితం పూర్తి చేసుకున్న కార్యక్రమానికి కూడా వెళ్లాను. నాగార్జున, నేను తరచుగా కలుస్తుంటాం. అలాగే, విష్వక్సేన్ పై ఒక ముద్ర వేసి, అతడు మన మనిషి కాదు... అతడి ఫంక్షన్లకు వెళ్లాలా అని భావించకూడదు. కచ్చితంగా వెళ్లాలి... అతడు కూడా ఇండస్ట్రీలో మనిషే... మన కుటుంబంలో ఒకడు అని సందేశాన్ని అందించాలి. మా ఇంట్లో ఎంతోమంది హీరోలం ఉన్నాం.అందరం కలిసి మెలిసి ఉంటాం. మా ఇమేజ్ ఏమన్నా తక్కువా ఇవాళ లైలా ఫంక్షన్ లో ఏవీలో పవన్ కల్యాణ్ కనిపించగానే హోరెత్తిపోయింది. దానికి నేను గర్వపడాలి. పుష్ప-2 పెద్ద హిట్టయింది బ్లాక్ బస్టర్ అయింది .అందుకు నేను గర్విస్తాను. ఒక్కోసారి సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు. కానీ ఒక సినిమా బాగా ఆడిందంటే కొన్ని వేల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా లాభపడతాయి. అందుకే ఒకరు హిట్ కొడితే అందరూ ఆనందపడాలి. ఇక్కడ సంపాదించుకున్న సొమ్మును ఇక్కడే పెట్టుబడి పెడుతుంటారు. నిర్మాత సాహు గారపాటి ఇంతకుముందు మూడు సినిమాలు తీశాడు.వచ్చిన డబ్బులు మరో సినిమాకు పెడుతున్నాడు. ఓ నిర్మాత నాకు అడ్వాన్స్ ఇస్తున్నాడు అంటే ఆ డబ్బులు మరో హీరోతో తీసిన సినిమా ద్వారా వచ్చినవే కదా. అందుకే ఇండస్ట్రీలో అందరూ అవినాభావ సంబంధంతో ఉండాలి" అని చిరంజీవి వివరించారు
Latest News